పూర్వం కాశ్మీరరాజ్యాన్ని చిత్రవర్మ పాలించేవాడు. అందానికి అందం, ఐశ్వర్యానికి ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి అతనికి. ప్రజలకి చిత్రవర్మంటే ప్రాణం. మహారాజంటే ‘మారాజే’ అంటారతన్ని. అలాంటి రాజుకి ఒకటే కొరత. భార్య లేదు. పెళ్ళి కాలేదింకా. నచ్చిన కన్య దొరకక చిత్రవర్మ పెళ్ళి చేసుకోలేదు. రాజుగారికి పెళ్ళి కాకపోవడం ముందు ముందు రాచరికానికి ప్రమాదమని మంత్రులంతా హెచ్చరించారు. దాంతో నచ్చిన కన్యను వెదకి పెళ్ళాడేందుకు చిత్రవర్మ మంత్రిసామంతులతో పర్యటన ప్రారంభించాడు. చూడని దేశం లేదు. చూడని కన్య లేదు. ఏ కన్యను చూసినా చిత్రవర్మకి నచ్చట్లేదు. మనసుకు నచ్చిన స్త్రీ కావాలి. కాపురం అంటే రెండు శరీరాల కలయిక కాదు, రెండు మనసుల కలయిక అనుకుంటూ వెను తిరిగాడు చిత్రవర్మ. కాశ్మీరరాజ్యానికి రెండు రోజుల్లో చేరుకుంటారనగా ఓ రాత్రి మహారాజు ఓ నదీతీరంలో బస చేశాడు.గుడారంలో తల్పంమీద కూర్చుని, దస్తూరీని అభ్యాసం చేస్తున్నాడు. తాళపత్రాల మీద ఘంటంతో రాస్తున్నాడు. సన్నగా ఏదో పాట వినవచ్చింది. చాలా విషాదంగా ఉందది. గుండెల్ని పిండేస్తోంది.

అందం శాపం

ఆనందం దుఃఖం

వెన్నెలంటే చీకటే!

నవ్వులంటే రోదనలే!

గుడారంలోంచి ఒక్క ఉదుటన బయటికి వచ్చి, పాట వినవచ్చిన వైపుగా చూశాడు చిత్రవర్మ. వెన్నెలరాత్రి కాబట్టి కనిపించింది, ఎవరో స్త్రీ పడవ నడుపుకుంటూ నదిలో ప్రయాణిస్తోంది.

‘‘ఎవరక్కడ’’ కేకేశాడు చిత్రవర్మ. సమాధానంగా నలుగురైదుగురు భటులు పరిగెత్తుకు వచ్చారు. పడవలో ప్రయాణిస్తున్న స్త్రీని చూపించాడు వారికి.‘‘వెళ్ళి ఆమెను జాగ్రత్తగా తీసుకుని రండి.’’ చెప్పాడు చిత్రవర్మ. మహారాజు చెప్పడమే ఆలస్యం భటులు పరుగు పరుగున అటుగా వెళ్ళారు. పడవల్లో దూసుకుపోయి, ఆ స్త్రీని అడ్డగించారు. జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చారామెను. చిత్రవర్మ గుడారానికి తోడుకుని వచ్చారు. ఆమె గుడారంలో అడుగుపెడుతోంటే వెలుగులు విరజిమ్మాయి. పెద్దపెద్దకళ్ళు, సన్నగా ముక్కు, ఎర్రనిపెదవులు... పోతపోసిన బంగారుబొమ్మలా ఉన్నదామె. చూసినకొద్దీ చూడాలనిపిస్తోంది చిత్రవర్మకి. మనసుకి హాయి అనిపించింది. ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా నిరీక్షించినందుకు గొప్ప అందగత్తె భార్యగా లభించిందనుకున్నాడతను. ఏకాంతం కావాలన్నట్టుగా భటులను చూశాడు. వెళ్ళిపోయారు వారు. అప్పుడు తనని తాను, ఆమెకు పరిచయం చేసుకున్నాడు చిత్రవర్మ. తర్వాత ఇలా అన్నాడు.