భరణి కార్తె ఎండల్ల బండలు పలగొట్టి మెల్లెగ అడుగులడుగేసుకుంట ఊరవతలికి పోయిండు సూర్యుడు. బర్లు, గొర్లు ఊర్లెకు మల్లినయ్యి. నడూర్లున్న చింతచెట్టు కింద పరీక్షలైపోయిన పోరలందరు గూడి అప్పటిదాంక ఆడిన ఆటలు బందు వెట్టి ఇండ్లల్లకుమల్లిండ్రు.

ఊరవతల ఇసిరేసినట్టున్న రెండర్రల పెంకుటింట్లున్నామె... ఇగ పొద్దు మూకిందని పొయ్యి రాజేసి జొన్నరొట్టెలు కొట్టింది. బాయికాడ మిర్ప శేన్ల ఆడాడ మొల్చిన కొయిగూరని తెచ్చింది. గదే ఒండింది. ఇంటెన్క జారట్లకొయ్యి పెద్ద గోలెంల ఉన్న సల్లటి నీల్లతోటి మొకం కాల్జేతులు కడుక్కొచ్చుకుని ఒచ్చి జడిప్పి మల్ల కుదురుగేసుకున్నది. నొసటన చారాన బిల్లంత కుంకుమ దిద్దుకుంటుండంగ మొగడింట్లడుగు పెట్టిండు. పాలచెంబు చేతికందించిండు. జారట్లకొయ్యి పెయ్యి కడుక్కొచ్చుకుండు.సందడి లేక ఇల్లు చిన్నబోయిందని ‘పోరలేరం’టని అడిగిండు. ‘ఆఖరి పరీక్ష అయిపోయేటాల్లకు మా తమ్ముడొచ్చి ఇద్దర్నీ తోల్కపోయిండు’ అని చెప్పింది.మెల్లెగ అతని పెదిమలిచ్చుకున్నయి. అదీ ఇదీ ముచ్చటవెట్టుకుంట కుదార్తంగ కూసోని చెర్రెండు రొట్టెలు తిన్నరు. ఎండకాలం కడుపుల సల్లగుంటదని నెత్తికింత పెద్ద గ్లాసెడు సల్ల తాగిండ్రు.

చెయ్యి కడుగుకుని మూతి తుడ్సుకుంట మెల్లెగ ఆకిట్లకొచ్చిండు. వంటిల్లు సదిరేసి ఎన్కనే ఒచ్చింది.ఇద్దరొగర్నొగరు చూసుకున్నరు. కండ్లు మాట్లాడుకున్నయి. పెదిమలు ఇచ్చుకున్నయి. సంతోషంతోటి ఇద్దరి గుండెలు నిండుకున్నయి. అట్టడుగుకి చేరుకున్న ఎనకటి సంగతులు యాదికొచ్చి అలుగెల్నయి. మునుపటి ముచ్చట్లు కండ్లల్ల మెదిలి కొత్త వెలుగుల్ని నింపినయి.దండెం మీదున్న తువ్వాలు భుజాన్నేసుకుని మూలకు పెట్టిన ఎదురు కట్టెను చేతిలకి తీస్కుని మెల్లెగ ముందటికి అడుగేసిండు. ఆమె ఇంట్లకురికి, వంటింట్ల ఏందో సదిరి దొరికిచ్చుకొని కొంగుల కట్టుకుని రొంటిల దోపుకున్నది. బయటికొచ్చి తలుపు దగ్గరేసి గొళ్ళెంబెట్టి తాళమేసింది.

తాళం చెయ్యి మెడలున్న పసుపుతాడుకు కట్టుకుని బయటపడేట్యాలకు అతను అల్లంత దూరంగ నడ్సుడు కనవడ్డది.చుట్టూ చూసింది. ఊరప్పటికే సద్దు మణిగింది. చీకట్లు నిండ అలుముకున్నయి.అతను ఇంకొంచం దూరం పోయినంక ముందల్కి కదిలింది సుట్టుముట్టు సూసుకుంట. తమ పొలంకి పొయ్యే తొవ్వపొంటి ఇంకింత ముందల్కి పోంగనే దగ్గర్లున్న అడివిలకి పొయ్యే పిల్ల బాటలకి మర్లిండు. అప్పటిదాంక దూరంగ ఎన్క ఎన్కనే నడుస్తున్నది ఆయింత ఉరుకొచ్చి నడుస్తున్న అతని మీద ఎన్కకెల్లి ఎగిరి మీదపడ్డది.