రెండువైపులా వొకదానిపైనొకటి పడుతున్నట్టుగా వుమ్మడిగోడలపైన కట్టిన మట్టిమిద్దెల మధ్యలో, పదడుగులకు మించని సన్నటి వీధిలో, ఆ ఆసుపత్రి బంట్రోతు వెనక తానెంత దూరం నడచి వచ్చిందో పల్లవికి తెలియదు.తనను దింపిన బస్సు ముందుకెళ్ళిపోయాక తొలిసారిగా ఆ వూరిని చూసిందామె. దారి తెలుసుకుని, వూరి చివర్లో బండలపైనున్న గవర్మెంటాసుపత్రిని చేరేసరికి, యెక్కడోవున్న యిండ్లనంతా చేటలతో చిమ్మి యిక్కడతెచ్చి కుప్పబోసినట్టుగా ఆ వూరు గజిబిజిగా వుందనే విషయం ఆమెకర్థమైపోయింది.పదిపడకల చిన్న ఆస్పత్రే అయినారోగులూ, రోగులుకానివాళ్ళూ మాగిన పండుపైన ముసిరే యీగల్లా కిక్కిరిసిపోయివున్నారు.గీతాలక్ష్మి కోసం అని వాకబు చేశాక నర్సు దుస్తుల్లోవున్న ఆమెను పట్టుకోడానికి చాలా సేపే పట్టింది. తనను చూడగానే ఆమెముఖం అదోలా ముడుచుకుపోవడం పల్లవి కనిపెట్టేసింది. తానామెను చూసి పంతొమ్మిది నెలలు దాటిందనీ, యిన్నాళ్ళుగా తనను చూడ్డానికి రానందుకు ఆమె కోపంతో మండిపడుతుందనీ, పల్లవికి జంకుగానేవుంది. అందుకే ఆమె కోప్పడి రాద్ధాంతం చేసేందుకు వీలులేకుండా, యిలా ముందుగా చెప్పకుండా వచ్చి, ఆమె డ్యూటీలో వున్నప్పుడు కలిసేలా జాగ్రత్త పడింది. ముఖం వెలవెలబోతూండగా, కోపంతో పెదవులు కొరుక్కుంటూ, ‘‘యీమె గార్ని మాయింటికి తొడుక్కొనిపొయ్యి యిడిసిపెట్టి రాపో’’ అని ఆస్పత్రి బంట్రోతుకు పురమాయించింది గీతాలక్ష్మి.వూర్లోకొచ్చి, నాలుగైదు వీధుల్ని దాటి, చిన్నసందులోకి తిరిగాక, పక్కనున్న యింటిని పడిపోకుండా పట్టుకున్నట్టున్న యిండ్లవరసలోని వో చిన్నయింటిముందు ఆగి, ‘‘యిదే!’’ అని చూపెట్టాడా బంట్రోతు.ముసుగుజారిపోయిన ముసలావిడ ముఖంలా బోసిపోతున్న వరండాలోకి ఆమె అడుగుపెట్టగానే, మూలలో పడుకున్న వూరకుక్క లేచి వీలయినంత తాపీగా వీధిలోకి నడిచింది. సందేహిస్తూనే పాతచెక్కతలుపు బీగంలోకి తాళంచెవిని దూర్చింది పల్లవి. బీగం తెరుచుకున్నాకగానీ తాను చేరాల్సిన యింటికే చేరానన్న నమ్మకమామెకు కలగలేదు.యెండలోంచీ యింటిలోకి అడుగుపెట్టేసరికి ఆమెకంతా అలుక్కుపోయినట్టుగా కనిపించింది. బ్యాక్‌ పాక్‌ సంచిని తీసి కింద పడేసి, ప్లాస్టిక్‌ కుర్చీలో కూర్చొందామె. చీకటి తెరలు విప్పుకుంటూ రాత్రి కరిగిపోయి తెల్లవారినట్టుగా ఆమె చూపులు క్రమంగా చుట్టూవున్న లోకాన్ని పరిచయం చేశాయి.గోడపక్కనున్న పాత చెక్క బీరువా,మూలలో నక్కిన నీలిరంగు ఫ్రిజ్జూ, కమ్ములస్టాండు పైని డబ్బా టీవీ తమ పాత పరిచయాల్ని గుర్తు చేస్తున్నాయి. యివతలి గోడ నానుకున్న చెక్క మంచం జాలిగా పలకరిస్తోంది. పరుపుపైని శాలువాలూ, దండెం పైని మాసిన చీరలూ, పాతవై మాసి పోయినా తనకు కొత్తగా కనబడుతూ, తానక్కడికెన్ని నెలలుగా రాలేదో నిలదీసి చెప్తున్నాయి.

                                                            ********************************************