‘ప్రేమించుకున్న వాళ్ళు కలిసుండటానికి పెళ్లి అవసరమేమో కానీ పెళ్ళైన వాళ్ళు కలిసుండటానికి ప్రేమ అవసరం లేదు’ అని చెప్పడానికా అన్నట్టు ఇరవై ఏళ్ళ క్రితం ఇత్తడి లెటర్స్‌తో చేసిన ‘ఇందిరా చక్రపాణి’ నేమ్ ప్లేట్ కిలుం పట్టి మెరవకపోవడంతో, విసుగొచ్చిన సూర్యుడు తన తొలికిరణాల్ని నెమ్మదిగా పక్కింటికి మరల్చాడు.క్రమశిక్షణ గల కార్మికుడిలా అలారం తన పని తాను చేసింది. రెండో కాన్పు అవగానే విడిపోయిన రెండు సింగల్ కాట్‌లలో ఒకదానిమీంచి లేచిన ఇందిర నేరుగా వంటింట్లోకి నడిచింది.
‘‘అలారాలు, కుక్కర్ విజిల్స్, నీకు సంబంధించిన రాగాలు’’ అన్నట్టు చక్రపాణి రెండో సింగల్ కాట్ మీద కాసేపు విసుగ్గా దొర్లి, పడుకునే ఫోన్ చూసుకున్నాడు. ఆమె కాఫీ పెట్టిచ్చింది. అతడు పేపర్ చదివాడు. ఆమె స్టవ్ మీద ఇడ్లీ పెట్టింది. అతడు వాకింగ్‌కి వెళ్ళొచ్చాడు. ఆమె కుక్కర్ పెట్టింది. అతడు స్నానం చేసొచ్చి పొట్టమీద పౌడర్, షర్ట్ మీద సెంట్ పూసుకున్నాడు. ఆమె టిఫిను, రెండోసారి కాఫీ ఇచ్చి క్యారేజీ హాల్లో పెట్టింది.అతడు కాఫీ తాగుతూ మిగిలిపోయిన పేపర్ చదివేసి, క్యారేజ్ పట్టుకుని ఆఫీస్‌కి బయల్దేరాడు.ఆమె తలుపేసుకుని స్టవ్ మీద బార్లీ పెట్టింది. అతడు సాయంత్రం వచ్చి తాగుతాడు. ఆమె డబ్బాలోకి జంతికలో, చేగోడీలో చేస్తుంది. అతడు ఎప్పుడు పడితే అప్పుడు తింటాడు. భర్తకి ఏ పూటకాపూట వేడిగా కంచంలో కనీసం మూడు ఐటమ్స్‌తో వడ్డించాలని అత్తగారు నేర్పించిన అలవాటు ప్రకారం ఆమె మళ్ళీ రాత్రికి ఏమున్నాయో తడుముకుంటుంది. పుల్కాలకి పిండి కలుపుతుంది. అతడు టి.వి. చూస్తాడు. ఆమె పుల్కాలు కాలుస్తుంది. అతడు అరగంట క్రితమే బై చెప్పిన కొలీగ్ తో ఫోన్ మాట్లాడతాడు. ఆమె దుంపలు ఉడకేస్తుంది. అతడు ఉక్కపోతగా ఉందని ఏ.సి వేసుకుంటాడు. ఆమె చెమట్లు కక్కుతూ కూర కలియబెడుతుంది. అతడు టి.వి. చూస్తూ లాగిస్తాడు. ఆమె కిచెన్ శుభ్రం చేసుకుంటుంది. అతడు గుర్రు పెట్టి పడుకుంటాడు. ఆమె అలారం పెట్టుకుంటుంది. ఓరాత్రప్పుడు అది ఆన్‌లో ఉందో లేదో కంగారుగా టైం చూసుకుంటుంది. అతడు నిశ్చింతగా నిద్రపోతాడు.