పరిచితాపరిచితాల మధ్య అస్పష్ట రేఖ చెదిరి, లోపలి పొరల్ని చీల్చుకుని ఒకరి కోసం పుట్టే అపురూప భావన జాడే లేకుండా, ఏ ప్రత్యేకతా ఏ సంచలనమూ లేని అలజడి నుండి మొదలయ్యే సహజమైన జంతుస్పర్శ. చేతుల ఒరిపిడిలో, మాంసపు ముద్దపై గరుకు తొడిమెల తాకిడిలో, వెలుగు నీడల మధ్య ... ఆ రాత్రి ఏమయ్యాన్నేను? నరాల్లో రక్తం జివ్వున ప్రవహించి, స్పృహను పాతాళంలోకి విసిరికొట్టిన క్షణాన చివరికి మిగిలింది వేళ్ళ చివర్లలో వెచ్చటి స్పర్శ మాత్రమేనా!?ఇంకేమైనా ఉందా?

************************

‘‘మారుతీ వచ్చేస్తున్నా... నువ్వు రెడీ కదా?’’బస్‌ మెహిదీపట్నం దాటుతోంది.‘‘ఒకే సర్‌.. పొద్దున ఆరుకల్లా స్టేషన్‌కి వచ్చేస్తా’’ మారుతి గొంతులో ఉత్సాహం.లక్డికాపూల్‌లో బస్‌ ఎక్కాను. కిటికీ తెరిస్తే చల్లటి గాలి. లాస్ట్‌ మినిట్‌ రిజర్వేషన్‌ కావటంతో చివరి సీట్‌ దొరికింది. ఈ చివర కిటికీ పక్కన నేను. ఆ దరిన ఇంకెవరోఉన్నారు.మొబైల్‌లో ఏదో నోటిఫికేషన్‌. ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌... పేరు పల్లవి. ఫోటో చూశా బావుంది. యాక్సెప్ట్‌ చేశా. వాటికింద చూసీ చూడనట్టు వదిలేసిన మగ ప్రొఫైల్స్‌.బాగా అలసిపోయి ఉన్నా. పగలంతా ఆఫీస్‌లో క్షణం తీరికలేదు. ఫ్లాట్‌ కెళ్ళి స్నానం చేసి, హడావిడిగా బస్‌ ఎక్కేశాను. జడ్చర్లలో ఆగినప్పుడు ఏమైనా తినాలి.బస్‌ ఆరాంఘర్‌ దాటిందో లేదో... నిద్ర పట్టేసింది.. ఉలిక్కిపడి లేచాను. ఎవరో నీళ్ళు చల్లినట్టయింది. చల్లగా మొహంపై తుంపర...సన్నటి జల్లు బస్సు లోపలికి కొడుతోంది. కిటికీ మూస్తే గాలి సరిపోయేలా లేదు. నా పక్కసీటు ఖాళీగానే ఉంది. ఆ పక్కనే ఒక పెద్దావిడ ఉంది. బస్‌లో లైట్స్‌ ఆపేసినా, మొబైల్‌ ఫోన్‌ల వెలుగు, హైవే వెలుతురులో వెలుగు నీడలు కదిలిపోతూ ఉన్నాయి. సీటు మారాను. అప్పుడు చూశాను-పెద్దావిడ పక్కనే కూర్చున్న ఆమె ముఖం సగం సగంకనిపిస్తోంది.బహుశా అత్తా కోడళ్లేమో .. మాటల్ని బట్టి అనిపించింది.ఇంటి కబుర్లు చెప్పుకుంటున్నారు.లైట్లు వెలిగాయి. బస్‌ ఆగింది.జడ్చర్ల వచ్చింది.‘‘ఓ పదినిమిషాలు ఆగుతుంది.. తినేవాళ్ళు తినొచ్చు’’ క్లీనర్‌ అరుస్తున్నాడు.‘‘అత్తయ్యా మంచినీళ్ళు తెస్తా.’’