ఆ యువకుడి ఇంటికి రథం పంపాడు సామ్రాజ్య చక్రవర్తి. ఉన్నపళాన బయలుదేరి రమ్మన్నాడు. ప్రియురాలు ఇచ్చిన మహిమగల ఉంగరం ధరించి మార్గమధ్యంలో ఆటంకాలను అనుకూలంగా మార్చుకుంటూ రాజమందిరంలో ఆతిథ్యం స్వీకరించాడు ఆ యువకుడు. పంచభక్ష్యపరమాన్నాలతో విందు, చక్కటివసతి లభించింది. రాజు అతడిని ఏకాంతమందిరంలోకి పిలిచాడు. ఒక కఠిన పరీక్షలో గెలిస్తే లక్షవరహాలు బహుమానం ఇస్తానన్నాడు. ఇంతకీ ఏమిటా పరీక్ష?

రూపనగరంలో వినయశీలుడు అనే యువకుడు ఉన్నాడు. అతడు ఎంతో మంచివాడు. చాలా విద్యల్లో ఆరితేరాడు. తండ్రి అతణ్ణి వ్యాపారం చేయమన్నాడు. తల్లి అతణ్ణి రాజధానికి పోయి కొలువులో ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోమని చెప్పింది.అతడికి ఓ ప్రియురాలు ఉంది. ఆమెపేరు వివేకవతి. ఆమెమాత్రం ఈ రెంటికీ ఒప్పుకోలేదు. ‘‘నీకు వచ్చిన విద్యను పదిమందికీ చెప్పు. వాళ్ళు ఇచ్చింది పుచ్చుకో. తీరుబడి సమయంలో వృత్తివిద్యల్లో మనకున్న ప్రావీణ్యానికి అనుకూలంగా ఉండే వస్తువులు తయారుచేద్దాం. పెరడులో కూరలు పండిద్దాం. ఒకరితో ప్రమేయం లేకుండా ఎంతో హాయిగా ఇక్కడే మనం బ్రతకవచ్చు కదా!’’ అంది వివేకవతి.వినయశీలుడికి ఈ మాటలు బాగా నచ్చాయి. ప్రియురాలు చెప్పినట్లే చేద్దామనుకున్నాడు. తన ఉద్దేశ్యం తల్లిదండ్రులకుచెప్పాడు. వివేకవతిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నట్లు కూడా చెప్పాడు. తల్లీతండ్రీ అందుకు అంగీకరించారు. వివేకవతి ఇంటికివెళ్ళి పెళ్ళి ప్రస్తావన చేశారు. అందరికీ అన్నీ సమ్మతమయ్యాయి.

వివేకవతి తండ్రి ఓ పండితుణ్ణి పిలిపించి జాతకాలు చూపించాడు. ఆ ఇద్దరి జాతకాలూ పండితుడు ఎంతో శ్రద్ధగా పరిశీలించాడు. ‘‘అన్నీ చక్కగా సరిపోయాయి. ఈ వివాహం జరిగితే, ఈ భూమిమీద ఇంతకంటే చక్కనిజంట ఉండబోదు. అయితే, వివాహం అప్పుడే జరిపించవద్దు. నూటొక్క దినాలు ఆగాలి!’’ అన్నాడు పండితుడు.‘‘అంతవరకూ మంచి ముహూర్తం ఏదీ లేదా?’’ అడిగాడు వివేకవతి తండ్రి ఆశ్చర్యంగా.పండితుడు వివేకవతి తండ్రిని రహస్యంగా పిలిచి, ‘‘ఇది రహస్యం. మీలోనే దాచి ఉంచండి. వినయశీలుడి జాతకం పరిశీలించాను. అది చాలా గొప్ప జాతకం. అయితే, ఈ రోజుకు సరిగ్గా నూటొకటవ దినం లోపల అతడికి మరణగండం ఉన్నది. ఆ గండాన్ని తప్పించుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ అతడికి అసాధ్యం. ఒకవేళ తప్పించుకున్నాడో ఈ భూతలానికే చక్రవర్తి కాగలడు’’ అన్నాడు.