‘‘సార్‌, మిమ్మల్ని ఎం.డి. రమ్మంటున్నారు’’ సెక్యూరిటీ ఫోన్‌ చేసి చెప్పాడు.మెడికల్‌ ప్లాంట్‌లో బిజీగా ఉన్న ప్రసాద్‌కు అలాంటి పిలుపులేవీ కొత్తకాదు. కానీ ఆ రోజు పిలవడం వెనక రీజనేంటో ఎం.డి కంటే అతడికే బాగా తెలుసు. వారం రోజులైంది కొత్త డ్రగ్‌ స్టార్ట్‌ చేసి. ఈ వారం రోజుల్లో ఒక్కసారి కూడా అనుకున్న టార్గెట్‌ రీచ్‌ కాలేదు. మెటీరియల్‌ మాత్రం వేస్ట్‌ అవుతూనే ఉంది. దానికి అనేక కారణాలున్నాయి. గాడిన పడేదాకా చిన్నచిన్న తిప్పులు తప్పవు.

 తన షిఫ్ట్‌ సరిగా ఉన్నా తర్వాతి షిఫ్ట్‌లో మిస్టేక్‌ జరగొచ్చు. ఏ చిన్న పొరపాటు జరిగినా డ్రగ్‌ అంచనా తప్పొచ్చు.ఆలోచించుకుంటూనే ఎం.డి. రూమ్‌ లోకి అడుగుపెట్టాడు ప్రసాద్‌.‘‘ఏం ప్రసాద్‌.. ఇంట్లో సమస్యలేం లేవుగా?’’‘‘ఎస్సార్‌ .. నో సార్‌.’’‘‘నీ జీతమెంత?’’‘‘అరవై వేలు సార్‌.’’‘‘ఎక్స్‌ పీరియన్స్‌?’’‘‘పాతికేళ్లు సార్‌.’’‘‘మరి ఇంత జీతం తీసుకుంటూ, అంత ఎక్స్‌పీరియన్స్‌ పెట్టుకొని వారం రోజుల్లో డ్రగ్‌ను కంట్రోల్‌ చేయలేకపోయావా?’’‘‘సార్‌... అదీ...’’‘‘నసుగుళ్లు వద్దు. ఈ వారం రోజుల్లో వచ్చిన నష్టం ఒన్‌ అండ్‌ ఆఫ్‌ లాక్‌. అదే అవుట్‌ పుట్‌ వచ్చి ఉంటే ఫోర్‌ లాక్స్‌ బెనిఫిట్‌. ఏం చేద్దాం చెప్పు?’’‘మీ బాబుకు తెలుసురా.. ఒక డ్రగ్‌ కొత్తగా మార్కెట్‌లోకి తీసుకురావాలంటే ఎంత స్ట్రగుల్‌ ఉంటుందో. అబ్బ సొమ్ముతో అమెరికాలో ఎం.బి.ఎ. చేసి రావడం కాదు. జల్సాల పేరుతో వారానికో లేడీ పి.ఎ. ను మార్చి ఎ.సి. గదుల్లో కులకటం కాదు. ఎప్పుడన్నా ప్లాంట్‌లోకి వచ్చి మా తిప్పలేవో చూస్తే అంతుబట్టుద్ది? అయినా మెడికల్‌ ప్లాంట్‌ గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావ్‌?’ లోపలవాణ్ణి అణిచేసి,‘‘సారీ సార్‌... త్రీ డేస్‌లో ఫుల్‌ అవుట్‌పుట్‌ వచ్చేలా చూస్తా...’’ తలదించుకున్నాడు ప్రసాద్‌.‘‘త్రీ కాదు.. టూ డేస్‌... ఓన్లీ టూ డేస్‌.’’‘‘ఓకె సార్‌...’’ అంటూ బయటకు వచ్చి టైం చూశాడు. ఆరైంది. ఇంటికి వెళ్లొచ్చు. కానీ ఎందుకైనా మంచిదని ఓసారి ప్లాంట్‌ లోకి వెళ్లాడు. అప్పుడే తన కింద పనిచేసే స్టాఫ్‌ కూడా షిఫ్ట్‌ మారుతున్నారు.