‘‘ఇక్కడ బాగున్నాయే గవ్వలు!’’ అరిచాను మా ఆవిడ వైపు చెయ్యి చూపిస్తూ. చల్లటి సముద్రపు అలలు నా ఛాతిని మెల్లగా తాకుతున్నాయి. దూరంగా స్విమ్ చేస్తున్నారు నా భార్యా, పిల్లలూ. నాకవేమీ పట్టవు. నా లోకం నాదే. గవ్వల పిచ్చి!నీలం రంగు నీటి కింద మత్తుగా జారుతోంది తెల్లటి ఇసుక. షాలో వాటర్ మిట్ట మధ్యాహ్నపు సూర్యకిరణాలు పడి నీళ్ళల్లో అక్కడక్కడా మెరుస్తున్న షెల్స్.
కాళ్ళకి అవి తగిలినప్పుడల్లా నీళ్ళల్లో మునిగి పైకి తీసి చూస్తున్నాను. నాకు అన్ని రకాలూ నచ్చవు. పైన పర్ఫెక్ట్ ప్యాటర్న్స్ ఉండాలి, తెల్లగా ఉండాలి, ఎక్కడా పగలకూడదు, అందరూ ‘‘భలే ఉందే’’ అని ఆశ్చర్యపోవాలి, అసూయ పడాలి - అలాంటివి చాలానే కలెక్ట్ చేశాను ఇదివరకు కానీ ఇప్పుడెక్కడున్నాయో తెలీదు. పర్ఫెక్ట్గా లేనివి కూడా కొన్ని నచ్చుతాయ్. ఎక్కడా చూడనివీ, వేటితోనూ పోల్చలేనివీ. ఎక్కడో చిన్న చిల్లు, విరిగిన అంచు... అయినా నచ్చుతాయ్. వాటినెవరికీ చూపించను. ఎవరికి పట్టింది?!నా గవ్వల పురాణం పడలేక అడ్డంగా చెయ్యి ఊపింది నా భార్య - ‘‘నేన్రాను, బాగుంటే నువ్వే ఏరుకో’’ అన్నట్టు.నిట్టూర్చి ఇంకొంత లోపలికి వెళ్ళాను కాళ్ళీడుస్తూ. ముందున్న నీళ్ళల్లో మెరుస్తూ, ఊరిస్తూ కనపడిందో పెద్ద గవ్వ. ఓ క్షణం ఆగాను.
గట్టిగా ఊపిరి పీల్చుకుని లోపలికి మునిగాను. దాన్ని పట్టుకునేంతలో ఓ పెద్ద అలొచ్చి లోపలికి లాగేయబోయింది. చటుక్కున దూకి పట్టుకున్నాను. చిక్కింది. విజయగర్వంతో పైకి లేవబోతుంటే హఠాత్తుగా ఓ నల్లటి పొగ ఆవరించింది నా చుట్టూ. తెలియని చేతులేవో నా కాళ్ళని బలంగా లాగుతున్నాయి.పట్టు తప్పాను.ఏం జరిగిందో తెలిసేలోపే శరవేగంగా సముద్రంలోకి లాక్కెళ్తోందది నన్ను. గిలగిలా కొట్టుకుంటున్నా పట్టించుకోకుండా సముద్రపు నేలకి సమాంతరంగా ఈడ్చుకెళ్తోంది. నాచు మొక్కలూ, చేపల గుంపులూ నా మొహానికి బలంగా తగులుతున్నాయ్. నోటినుంచి మాట పెగలే అవకాశం లేదు. గుండె ఆగిపోతోంది, ఊపిరాడట్లేదు, మెదడు మొద్దుబారుతోంది. నీళ్ళ అడుగునుంచి చివరిసారిగా పైకిచూశాను. చల్లటి మంటలా కనిపిస్తున్నాడు సూర్యుడు పైన. నా కళ్ళు మూతపడుతున్నాయి.