‘‘చూడే అమ్మా, నన్ను సంగటి పిర్రలోడా అని గాండ్ల మిట్ట గజలక్ష్మి వెక్కిరిస్తా వుంది’’ అని ఐదో తరగతి చదివే ముద్దుకిష్టడు సరోజక్కతో చెప్పినాడు.

సరోజక్క పడీపడీ నవ్వుతూ ‘‘సంగటిలో రాగి పిండి పోస్తాము కాబట్టి సంగటి నల్లగుంటాది. నీ పిర్ర అయినా నా పిర్ర అయినా వేరొకరి పిర్ర అయినా నల్లగానే వుంటాది, దానికెందుకు ఏడుస్తావు, ఆటలాడేటప్పుడు గుడ్డలకి దుమ్మైతే ఏమి చేస్తావు? దులుపుకొని పోవా? దీన్ని కూడా దులుపుకుని పోరా’’ అని సర్ది చెప్పింది.అమ్మ మాటలకి తల ఊగించినాడు కానీ గాండ్ల మిట్ట గజలక్ష్మిని దెబ్బకు దెబ్బ తీయాలని అదునుకోసం చూసినాడు.అప్పుడే కలికిరి ఖాదర్‌ బాషా సైకిల్‌ బెల్లు కొడుతూ వచ్చినాడు. ‘‘తియ్య తియ్యటి మిఠాయి, తేనెలూరు మిఠాయి’’ అంటూ పీచుమిఠాయి అమ్మడానికొచ్చి భజనగుడికాడ సైకిల్‌ నిలబెట్టినాడు.దొంగ మాదిరి చిన్న చిన్నగా వచ్చిన గజలక్ష్మి పది పైసలకి పీచు మిఠాయి కొనుక్కుంది. 

పిలకాయలెవరైనా భాగానికొస్తారేమోనని జిగేల్‌ జిగేల్‌ పావడలో దాచుకుంది. ఏమీ తెలియనట్లు, తన వద్ద ఏమీ లేనట్లు నంగి ముఖం పెట్టి పావడ ఎగగట్టి ఇంటికి పరుగులు తీస్తా వుంది.‘భలే ఛాన్సులే’ అనుకుని చిన్నగా వెనకనే వెళ్లి కాలు అడ్డం పెట్టినాడు. దభీమని పడింది. ముద్దుకిష్టడు ‘అహ్హహ్హ...’ అని ముఖం ముప్పై మూడు వంకర్లు తిప్పుతూ విలన్‌ నవ్వు నవ్వినాడు. ‘నాతో పెట్టుకుంటావా’ అంటూ గుర్రం లెక్కన ఎగురుకుంటూ ఇంటికెళ్లినాడు. గజలక్ష్మి గట్టిగా ఏడుస్తూ మట్టి అంటని పీచుమిఠాయిని భద్రంగా ఏరిపించి కాగితంలో చుట్ట చుట్టుకుని ఇంటి దారి పట్టింది.ఇంటి ముందరి గోడమీది మల్లె చెట్టులోని సన్నజాజులు కోస్తున్న సరోజక్క అంతా చూసేసింది. గబగబా వచ్చి ‘‘ఏందిరా! ఇట్ల చేస్తా ఉండావు? ఆడబిడ్డలకి సాయం చేస్తావో చెయ్యవో నీ ఇష్టం కొడకా, వాళ్ళ కండ్లల్లో కన్నీళ్లు మాత్రం రానియ్యద్దురా కొడకా. ఎన్నో జన్మల నోముల ఫలం ఉంటే కానీ ఆడ బిడ్డ పుట్టదురా. ఆడబిడ్డ ప్రేమ అందరికీ దొరకదురా. దొరికినోళ్లు అదృష్టవంతులురా. ఆడబిడ్డ లేని ఇల్లురా మనది.