‘‘నానా నానా! పొద్దున అమ్మని నేనేవడిగానో చెప్పు?’’నివేద గొంతు విని తిరిగి చూశాను. చక్రాల్లాంటి కళ్ళు తిప్పుతూ మళ్ళీ అడిగింది. నేనేదో అనేలోపే నా చేతినుంచి న్యూస్ పేపర్ లాక్కుని పక్కన పడేసి, సమాధానం చెప్పమన్నట్లు చూసింది. కుడిచేతిలో రబ్బర్, ఎడమచేతిలో పెన్సిల్ పట్టుకు నిల్చున్న ఆ పిల్లని చూస్తుంటే శంఖు చక్రాలు ధరించిన విష్ణుమూర్తిలా ఉంది.
తన మొహంలో ఎప్పుడూ ఉండే కుతూహలం కాక, ఏదో అయోమయం కనిపిస్తోంది. పువ్వులా నవ్వులతో వికసించే మొహం ఎందుకో బిగదీసుకుని ఉంది.‘‘బుజ్జీ! ఏం కావాలమ్మా?’’ దగ్గరకి లాక్కోబోయాను. నా దగ్గరకి ఎపుడొచ్చినా ఎగిరి ఒళ్లోకి దూకి, చేతుల్ని దండలాగా మెడ చుట్టూ వేస్తుంది.ఈసారి అలా ఒళ్లోకి దూకలేదు సరికదా నా ముందు నిలబడి పంతంగా చూస్తూ మళ్ళీ అడిగింది,‘‘నేనూ... పొద్దున్న అమ్మని ఏవడిగానూ?’’తనేం అడిగిందో నాకు కొంచెం కూడా క్లూ అందడం లేదు. చేతులు రెండూ నా ఒళ్లో వేసి, నేనేం చెపుతానా అని మొహం వంకే చూడడం మొదలు పెట్టింది. నేను తప్పకుండా చెపుతాననే నమ్మకంతో తన కళ్ళలో మెరుపు, ఎట్లా అయినా చెప్పించాలన్న పట్టుదలతో పూనిన అలక సమానంగా కనిపిస్తున్నాయి.‘‘ఏం చెప్పాలమ్మా? మళ్ళీ అడుగు తల్లీ!’’‘‘అడుగుతున్నాగా నానా! పొద్దున్న అమ్మని నేనేవడిగానో చెప్పు?’’నాకేం చెప్పాలో తోచలేదు. ఈ పిల్ల పొద్దున్న వాళ్ళమ్మని ఏవడిగింది? తనకేం కావాలో అదడిగి ఉండొచ్చు.
వాళ్ళమ్మని అడగడానికి బోలెడు విషయాలు ఉంటాయి కదా! నిద్ర నుంచి లేచిందంటే చాలు ఈ పిల్లతో పాటు ప్రశ్నలు కూడా నిద్ర లేస్తాయి. ఒక ప్రవాహం లాగా అడుగుతూనే ఉంటుంది. అమ్మతో పాటు వంటగదిలోకి వెళ్ళినా హాల్లోకి వెళ్ళినా తోటలోకి వెళ్ళినా ప్రశ్నలు కూడా పిల్ల వెనకాలే పరిగెడుతూ ఉంటాయి. వాళ్ళమ్మకి విసుగ్గా ఉన్నపుడో, పనిలో ఉన్నపుడో, నిజంగానే తెలీనపుడో ‘ఏదైనా సరే నువ్వు మీ నాన్ననే అడగాలి’ అంటుంది. అలా అన్నపుడు మాత్రమే ‘నివి’ నా దగ్గరికి వస్తుంది తప్ప మిగతావన్నీ అమ్మ దగ్గరే.