‘‘వరుణ్, రేపు ఆదివారం కదా, మధ్యాహ్నం భోజనానికి రండి’’ జానకి కొడుకుతో అంది.‘‘ఏదన్నా విశేషమా, ఎవరన్నా వస్తున్నారా’’ ఆరా తీశాడు.‘‘కొడుకుని అమ్మ పిలవడం, కొడుకు అమ్మని చూడడానికి రావడానికి విశేషం వుండాలా! కొంచెం మాట్లాడాలి, సాయంత్రం వరకు వుండి వెళుదురు గాని.’’వరుణ్ ఒక్కక్షణం ఆగి ‘‘తను లేదు, వాళ్లింటికి వెళ్లింది’’ అని ఫోన్ కట్ చేశాడు.
పదకొండు గంటలకి వచ్చిన కొడుకు భుజం చుట్టూ చేయి వేసి ఆప్యాయంగా ‘‘పిలిస్తేగాని రావు. నెలయింది తెలుసా వచ్చి’’ అందికినుకగా.‘‘అవునమ్మా ఆదివారం వచ్చే సరికి ఏమిటో బద్ధకంగా వుంటోంది’’ రిలాక్స్‌గా సోఫాలో వాలి ‘‘కిందటి వారం నీవు వచ్చావుగా, కలవడం ముఖ్యం; ఎవరు ఎవరింటికి వస్తే ఏమిటి’’ అన్నాడు నవ్వి.‘‘నవ్య వుంటుందనుకున్నా, అందుకే యిద్దరినీ రమ్మన్నా’’ తనూ ఓ సోఫాలో కూర్చుంటూ అంది.‘‘వారానికల్లా గాలి అటుపోతుంది ఆవిడగారికి, నేను ఏడుగంటలకి ఇంటికి వచ్చేసరికే లేదు. ఫోనన్నా చేసి చెప్పలేదు.’’‘‘అదేమిటి, మళ్లీ ఏదన్నా గొడవపడ్డారా, చెప్పకుండా వెళ్లడం ఏమిటి!’’‘‘అమ్మా నాకేం తెలియదు, నన్నేం అడక్కు’’ విసుగ్గా అని, ‘‘తనిష్టం వచ్చినపుడు వెళ్తుంది, వస్తుంది, నేనేం అడగను.’’‘‘అదేమిట్రా, ఎక్కడికి వెళ్తున్నది భార్య చెప్పదు. ఎక్కడికెళ్లావని భర్త అడగడు, యిదేం సంసారం, మీ యిద్దరి పద్ధతి ఏం బాగులేదు’’ మందలింపుగా అంది.‘‘అమ్మా, నేనందుకే రాను. వచ్చిందగ్గరనించి నీతి బోధలు, సాధింపులు - యింట్లో తన గోల, యిక్కడ నీ గోల. నేనేం చెప్పినా నీవు కోడలినే సపోర్ట్ చేస్తావు. ఎందుకు చెప్పడం, అన్నం పెట్టు తినేసిపోతా’’ దురుసుగాఅన్నాడు.‘‘ఏమిటిరా నాన్నా, చిన్న పిల్లాడిలా అలక, ముప్పై ఏళ్లు వచ్చినా’’ కొడుకు చేయిపట్టుకుని నిమురుతూ అంది జానకి. ‘‘నీ కంటె కోడలెలా ఎక్కువవుతుంది, కానీ, మనింటికొచ్చిన పిల్ల .. కూతురే అనుకోవాలి.
ఆ అమ్మాయి మనసు నొచ్చుకుని తల్లీకొడుకు ఒకటే అనుకోకూడదని తనవైపు ఆలోచించి పెద్ద దానిగా సర్దిచెపుతాను. బాబీ, ఒక ఆడదానిగా, అమ్మగా, భార్యగా - అత్తింటి కోడలిగా వచ్చిన ఒక అమ్మాయి మనః స్థితి ఎలా వుంటుందో మీకేం తెలుస్తుందిరా, పుట్టిపెరిగిన యింటిని, ప్రేమాభిమానాల మధ్య పెరిగిన అమ్మాయికి ఒక్కసారిగా అన్నింటికీ దూరమై కొత్తచోటు, కొత్తయిల్లు, కొత్త మనుషులు, కొత్త అలవాట్లు, కొత్త వాతావరణం మధ్య యిదంతా నాది, వీళ్లందరూ నావాళ్లు అనుకోడానికి సమయం పడ్తుంది. భర్త అన్నవాడే తనవాడు. కావల్సిన వాడు అని నిన్నే నమ్ముకోని వచ్చినఅమ్మాయికి ‘నీకు మేమున్నాం. నీవు మా దానివి, ఈ ఇల్లు నీదే’ అన్న భరోసా యివ్వడం మనపని. అలాంటి భార్యకి నీవు ఆసరాగా నిలవాలి. అత్త మా అమ్మలాంటిదే అనుకునే నమ్మకం కలిగించితే మంచీచెడ్డా చెప్పి మందలించ గలదు అత్త. పెద్దదానిగా యిద్దరికీసర్దిచెప్పడం నా బాధ్యత గదా. కాని నిన్ను అడిగినంత చనువుగా ఆ అమ్మాయిని అడగను గదా.’’