‘ఛ, దిక్కుమాలిన వర్షం’ వారం నుండి కురుస్తున్న ఎడతెగని వానని తిట్టుకుంది రీతూ.‘‘ఇంకా కాలేదా? డిన్నర్‌కి అవినాష్ వచ్చే టైం అయింది, నీకు ఒక్కసారి చెబితే అర్థం కాదు’’ కళ్యాణ్ సకిలింపు.అప్పుడే పట్టుకున్న హ్యాండ్ బ్యాగ్ లోపల పెట్టి ‘‘ఇదిగో అయిపోయింది, జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్’’ కిచెన్‌లోకి పరిగెత్తింది, నూడుల్స్ లాంటి జుట్టుకి క్లిప్ బిగించి, వెజిటేబుల్స్ పట్టుకుంది.కాలేజ్‌లో కొన్న కెమెరా డి - 40 ని అలాగే జాగ్రత్తగా పట్టుకునేది. పిట్టలు, సీతాకోక చిలుకలు తీసి మురిసేది. పెళ్లి కాగానే కెమెరా మాయమై అనేక పరికరాలు చేతిలోకి వచ్చాయి. కళ ఇంటి పనుల్లోనూ, అతనికి కట్టే లంచ్ బాక్సుల్లోనూ ఇరుక్కొపోయింది.
రోజంతా టీవీతో, వాషింగ్ మిషన్‌తో, పక్కింటావిడతో, ఈ బోర్ డమ్‌తో కూడా బోర్ కొట్టేసింది.‘‘ఎవరాయన? అంత స్పెషల్ ఏంటీ?’’ రీతూ.‘‘క్యాంపస్‌లో నా ఇంటర్నేషనల్ సెమినార్ సక్సెస్ అయినందుకు పార్టీ ఇచ్చా కదా. తను మిస్సయ్యాడు, తను చెబితేనే నేను సెమినార్‌కి పేపర్ సబ్మిషన్ చేశా.’’అటు చూసింది. ‘కనపడని తన కెమెరా గురించి అడుగుదామా? ఎప్పటిలా కసిరితే’ బెరుకుగా బైటికి చూసింది.ధారగా నింగి వగపు.కాలింగ్ బెల్ పిలిస్తే వెళ్లి డోర్ తీసింది రీతూ. నల్ల కళ్ళద్దాలతో అతను. చేతిలో సన్నటి స్టిక్.‘‘మీరా! నేను ఇంకెవరో అనుకున్నాను’’ కళ్ళు ఇంతవి చేసింది.‘‘యా.. చూశారా రీతూ, నా మాట నిజమైంది.’’ఆ నవ్వు, ఒత్తయిన జుట్టూ, మంచి రంగూ చూశాక అదొక్కటే అతనికి ఉండకూడని లోపం అని పదహారోసారి అనుకుంది.బైటికి వచ్చిన కళ్యాణ్, ‘‘ఏ మాట నిజమైంది? మీరు ఎలా పరిచయం?’’ఆమె అవినాష్‌ని చూసి నవ్వింది. కల్యాణ్ ఆమెకెదురుగా వచ్చి నిలబడ్డాడు.‘‘అదీ.. మీ సెమినార్ రోజు నా పక్క సీట్లో కూర్చున్నారు, అలా పరిచయం, అంతే’’ వెళ్లిపోయింది.‘‘ఈమధ్య నీకు మతిమరపు పెరుగుతుంది, లంచ్ బాక్స్‌లో పెరుగు పెట్టడం మర్చిపోయావ్, హాఫ్ మైండ్ ఫెలో.. హు..’’‘ఇప్పుడిది ఎందుకు గుర్తొచ్చిందో’ అనుకుంటూ ‘‘సారీ’’ అని అవినాష్ వైపు ఇబ్బందిగా చూసింది. అతను స్పందించలేదు.