సూట్ కేసులోంచి నా జీవితంలో అతి ముఖ్యమైన రెండు ఫోటోలు తీసి టేబుల్ లాంప్ బల్ల మీద పెట్టేను.అమ్మ ఫోటో, ఆ పక్కనే మా ఇద్దరి ఫోటో. హనీమూన్‌లో నా భుజం చుట్టూ చెయ్యి వేసి నాకేసే చూస్తున్న శశాంక్ మెరిసే చిలిపి కళ్ల ఫోటో.శశాంక్ వెల్లకిలా పడుకుని తల మీద చెయ్యి వేసుకుని దీర్ఘాలోచనలో మునిగిపోయి ఉన్నాడు.
వేడి నీళ్లతో తల స్నానం చేసి వచ్చేసరికి ఒంట్లో ఓపిక అయిపోయినట్లయ్యినా ఎడతెరిపిలేని ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మనసు కాస్త తెరిపిన పడ్డట్లయ్యింది.తల తుడుచుకుంటూ ‘‘నువ్వూ వెళ్లరాదూ, కాస్త ఫ్రెష్‌గా ఉంటుంది’’ అన్నాను.ఇంకా యోగముద్రలో ఉన్నట్టే ఉన్న శశాంక్ ఉలకలేదు, పలకలేదు.చేత్తో తట్టేను.‘‘అబ్బబ్బ రాగా, నన్ను విసిగించకు. ఒకసారి నీకు చెప్తే అర్థం కాదా’’ గట్టిగా అరిచేడు.‘‘అదేవిటీ అసలెప్పుడు చెప్పేవు?’’ అన్నాను నేను కూడా మొండిగా.‘‘ఇదే నీతో వచ్చిన ప్రాబ్లం. పంతం. ఇప్పుడేంటి? నువ్వు స్నానానికెళ్తే నేను కూడా వెళ్లాలా? నేను వెళ్లను’’ అని అటు తిరిగి ముసుగు పెట్టుకున్నాడు.‘‘వెళ్లకపోతే మానెయ్యి. నీ ఖర్మ ..’’ అనాలని నోటి చివరి వరకూ వచ్చింది కానీ గొడవ పెంచడం ఇష్టం లేక బాల్కనీ లోకి వచ్చి కూచున్నాను.దుఃఖం తన్నుకు వస్తూంది.
గత ఆరు నెల్లుగా ఇలాగే ఉంది మా ఇద్దరి మధ్యా.మార్చి నుంచి కరోనా తీవ్రత వల్లఆఫీసులు ఇంటి నుంచే పనిచెయ్యమని ఆదేశించాయి.‘హమ్మయ్య’ ఇంటి నుంచే పనిచెయ్యడమంటే ఇద్దరం కలిసి రోజూ టిఫిన్ చేయొచ్చు, లంచ్ చేయొచ్చు అనుకుని పొంగిపోయాను నేను.ఇన్నాళ్లూ ప్రతీ రోజూ ‘సాయంత్రం ఎంత త్వరగా అవుతుందా’ అని ఒక్కదాన్నీ ఇంత పెద్ద ఇంట్లో బిక్కుబిక్కుమని ఎదురుచూసే బాధ తప్పుతుందని ఎంతో సంతోషపడ్డాను.అయితే నేను ఊహించుకున్నదొకటి, ఇక్కడ జరుగుతున్నది మరొకటి.ఇల్లు కొనగానే ఇంట్లో తన ఆఫీసు కోసం ఒక గది సెపరేట్‌గా పెట్టుకున్నాడు.కానీ ఇంటి నుంచి ఒంటరిగా పనిచెయ్యడం ఇష్టం ఉండదని క్రమం తప్పకుండా తను ఆఫీసుకి వెళ్లడం వల్ల ఆ గదికి ఇప్పటివరకు మోక్షం రాలేదు.