ఢాం... ఢాం... ఢాం...బాంబుల ప్రేలుడుతో అర్ధరాత్రి ప్రశాంత వాతావరణం ఛిన్నాభిన్నమైంది. సర్వత్ర నిండుకున్న నిస్తబ్ధతను చీల్చి ఆ ధ్వని తరంగాలు ఒక విచిత్ర సంచలనం కలుగజేసి శూన్యంలో విలీనమైనవి. గాఢనిద్రలో నిమగ్నమైయున్న గ్రామమంతా ఒక్కపెట్టున దద్దరిల్లిపోయింది. ఆబాలగోపాలం గొల్లుమన్నారు... నిద్రమబ్బులో ఏమి జరిగిందో ఎవరికీ బోధపడలేదు.

ఏదో ఆవేదన... ఏదో చికాకు... ఏదో బెగడు. కాని అంతా అగమ్యగోచరమే. ఊరివారందరికీ ఒకే సమయాన ఏదో మహాభయంకరమైన పీడకల వచ్చి హఠాత్తుగా నిద్ర నుండి త్రుళ్లిపడి లేచారా అన్నంత అలజడి చెలరేగిందా రెండు నిమిషాల్లో...ఇంత అలజడి చెలరేగినా బజార్లు మాత్రం నిర్మానుష్యంగానే ఉన్నవి. లోపలి నుండి వేసుకున్న తలుపుల గొళ్లాలు తీసి బయటికి తొంగి చూతామనుకున్నవారి చేతులు కూడా గొళ్లాల మీదికి పోగానే ఎక్కడివక్కడ జలదరించి నిలిచిపోయినవి. చికాకుల్ల కీచుకీచుమని అరుస్తూ తత్తరపాటుతో అటూ ఇటూ లేచిపోయే పక్షుల రవం వాటి ఱెక్కల తటతట, ఊరిచుట్టు పెరండ్లలో నుండి కుక్కల అఱపు, దొడ్లలో నిశ్చింతగా నెమరువేస్తున్న పశువుల గిజగిజ, అక్కడక్కడ దొడ్లకంపను విరుగద్రొక్కి ఊళ్లో తోచిన దిక్కల్లా పరుగెత్తే దున్నపోతుల గిట్టల ఱాపిడి - ఇవి మాత్రమే ఆ తదుపరి వినిపించినవి. అంతేకాని ఒక్కసారి గొల్లుమన్న గ్రామస్తులు మాత్రం అదేదో దివ్యజ్ఞాన బోధ కలిగిందా అన్నట్లు మళ్లీ కిమ్మనలేదు... కిమ్మనలేదు నిజమేకాని బొడ్డూసిన కూన పర్యంతం ఎవ్వరు నిద్ర కూడ పోలేదు... ఏవో గుసగుసలు... ఏవో సైగలు... ఏవో అసహాయ దృక్కులు... ఏవో వినపడని మ్రొక్కులు... తల్లులు పిల్లలకు శ్రీరామ రక్ష తీశారు. పిల్లల దడపు పోవడానికి ఎడమ అరికాలు దుమ్ముతో నొసట బొట్టు పెట్టారు. వీపు చరచారు. కాని పిల్లల దడుపుకుపాయాలు యోచించే తల్లులకు తమ దడుపుకే ఉపాయం దొరుకలేదు. బొట్టు పెట్టుతున్న చేతుల గాజుల గలగల మంటూనే ఉన్నవి. ఉన్నచోటనే ఉన్న కాళ్ల పాజేబులు కూడ కించిత్తు ఝంకరిస్తూనే ఉన్నవి...అదొక విచిత్ర ప్రళయం... అదొక క్షణిక మృత్యుతాండవం, అదొక అస్థిరోత్పాతం...

****************

ఒక గంట గడిచింది... ఎప్పటివలెనే నలువైపుల అంధకారం అలముకొన్నది. చిమ్మట్లు ఏకశృతితో అరుస్తున్నవి... అంతా మామూలే. కాని నిద్ర మాత్రం ఊరి దరి జేరలేదు.