గోమతి చెట్టియారుకు వయసు ముప్పై ఉంటుంది. తల్లిదండ్రులు ఆడపిల్ల అనుకునే అతనికి గోమతి అని పేరు పెట్టారు. అతనికి ముందు పుట్టిన ఏడుగురూ అచ్చంగా ఆడపిల్లలు. చిన్నప్పటి నుంచే గోమతికి జడ వేసి పువ్వులు పెట్టుకోవడం, గాజులు తొడుక్కోవడం అంటే అంతులేని ఇష్టం. మగపుట్టుకే అయినా స్వభావం మాత్రం అచ్చు ఆడపిల్లే. అలాగే పెరుగుతూ వచ్చాడు. పదాలను సాగదీస్తూ తల ఊపుతూ మాట్లాడడం చిన్నపిల్లవాడిగా ఉన్నపుడు పొంతనగానే ఉండేది. ఆడపిల్లలతోనే ఇష్టంగా ఆడుకునేవాడు. మగ పిల్లలతో ఆడుకోవలసి వస్తే ఇల్లు కట్టుకుని పెళ్లి చేసుకునే ఆటలోనే ఇష్టం ఎక్కువ. అందులోనూ పెళ్లికూతురుగా తనని పెడతానంటేనే ఆటకు ఒప్పుకునేవాడు.
వయసు పెరిగే కొద్దీ మగవాళ్ళతో కలిసి మెలిసి తిరగడం మానేశాడు. ఆడవాళ్ళు ఉండే ప్రదేశంలోనే సదా అతన్ని చూడవచ్చు. ఏదైనా వింతైన విషయం వింటే చటుక్కున చేతులు చరిచి, కుడి చెయ్యిని ఎడమ చెయ్యి మీద ఆనించి చూపుడు వేలును కొక్కిలాగా వంచి ముక్కు మీద పెట్టుకునేవాడు. వెడల్పయిన నల్లని చాందు బొట్టు పెట్టుకుని తమలపాకు వేసుకుంటూ నాలుకను ముందుకు చాపి ఎర్రగా పండిందా అని తరచూ చూసుకునేవాడు. జుట్టును కొప్పుగా ముడిచి పువ్వులు పెట్టుకునే వాడు. అతను ధరించే చొక్కా కూడా స్త్రీలు ధరించే జంపరు మోస్తరుగానే ఉంటుంది.
దానిమీద వేసుకునే తువ్వాలును చీటికీ మాటికీ పైటను సరిచేసుకునే తీరులో లాక్కుంటూ, నడుమును అటూ ఇటూ తిప్పుతూ అచ్చు ఆడవాళ్ళలాగే చేతులను వయ్యారంగా ఊపుకుంటూ నడిచేవాడు. ఎదురుగా మగవాళ్ళు తటస్థ పడితే గోమతికి ఎక్కడ లేని సిగ్గు ముంచుకు వస్తుంది.స్త్రీలు కూడా ఇతన్ని తేడాగా భావించింది లేదు.ప్రవర్తించిందీ లేదు. ఎక్కడికి వెళ్ళినా ఇతన్ని ఇష్టంగానే తమతో చేర్చుకుంటారు. స్త్రీ పురుషుల మధ్య సంబంధాల తాలూకు కథలను చెప్పి వాళ్ళను సంతోష పెట్టేవాడు.మనసును తాకే విధంగా శోక గీతాలు పాడి వాళ్ళకు కన్నీళ్లను తెప్పించే వాడు. కానీ ఒక చోట కుదురుగా ఉండేవాడు కాదు. ఒక ఇంట్లో కొన్ని రోజులు ఉండి, ఉన్నట్లుండి చెప్పా పెట్టకుండా ఇంకో ఇంటికి వెళ్లిపోయేవాడు.