సంజీవప్ప రైలు దిగి, స్టేషన్‌నుండి బయటకు రాగానే, ఆటోడ్రైవర్లు మూగి ‘‘ఎక్కడికి పెద్దాయనా’’ అని అడిగినారు.‘‘ఎక్కడికి వెళ్లేది తర్వాత చెబుతాను. ఏ ఆటో ఎక్కాలో ముందు మీరు చెప్పండి’’ అన్నాడు, ఆ ఏడు పదుల పెద్దాయన!‘‘కూచో పెద్దాయనా’’ అంటూ ఒక డ్రైవర్‌, అతని చేతిలోని సూట్‌కేస్‌ అందుకున్నాడు.

సంజీవప్ప ఆటోలో కూర్చుని ‘‘విజయనగర్‌ కాలనీ’’ అన్నాడు.‘‘కాలనీలో ఎక్కడ పెద్దాయనా?’’‘‘పెట్రోల్‌ బంక్‌ పక్కన వినాయక అపార్ట్‌మెంట్స్‌. నేనూ చూడలేదు, కొత్తగా కట్టినారట. మా అన్న కూతురుంది అక్కడ’’ అన్నాడు.‘‘చాలా దూరం పెద్దాయనా.. నూరు రూపాయలివ్వండి’’ అన్నాడు ఆటోడ్రైవర్‌.‘‘అలాగే ఇస్తాను పద నాయనా’’ అన్నాడు. ఆటోవాళ్లతో సాధారణంగా బేరమాడడు. వాళ్లు ఎంత అడిగితే అంత కాదనకుండా ఇస్తాడు. కష్టాన్ని నమ్ముకొని బతికేవాళ్లు. రైల్వేస్టేషన్‌ దగ్గర ప్యాసింజర్ల కోసం గంటల తరబడి కాచుకొని వుంటారు. వాళ్లతో బేరమాడటమంటే ఏదో గిల్టీనెస్‌ ఫీలవుతాడు సంజీవప్ప.అరగంట తర్వాత నిర్దేశించిన అపార్ట్‌మెంట్‌ ముందు ఆగింది ఆటో. అప్పటికే సంజీవప్ప అన్న కూతురు రాజ్యలక్ష్మి గేట్‌ ముందు నిల్చుని వుంది. అప్పటికి బాగా తెల్లవారింది. తెలుపూ ఎరుపూ కలిసిన వాతావరణపు వెలుగు అంతటా రమణీయంగా వ్యాపించి వుంది.ఆటో దిగక ముందే రాజ్యలక్ష్మి, సంజీవప్ప చేతిలోని సూటేకేస్‌ అందుకుంది. అతడు డ్రైవర్‌కు డబ్బులిచ్చి కిందికి నెమ్మదిగా దిగి, ఆ కొత్త అపార్ట్‌మెంట్‌ను ఎగాదిగా చూసినాడు. ఐదంతస్తుల అపార్ట్‌మెంట్‌, గంభీరంగా హోదాగా నిటారుగా నిల్చున్నట్లు ఉంది.ఆ అపార్ట్‌మెంట్‌ చుట్టూ పెద్ద కాంపౌండ్‌. ఒక్కో ఫ్లోర్‌లో ఆరు కుటుంబాల చొప్పున ముప్పయి కుటుంబాలు నివసిస్తున్నాయని వివరించి చెబుతూ వుంది రాజ్యలక్ష్మి. 

ఆ ప్రాంగణం అప్పుడే నిద్రమేల్కొని ఆవలిస్తున్నట్టుగా వుంది. దిగువనున్న ఖాళీ స్థలంలో కొందరు వాకింగ్‌ చేస్తూ కన్పించారు. కొందరు స్కూటర్లతో బయటకు పరుగులు తీస్తున్నారు. ఉదయం పూట విన్పించే చప్పుళ్లేవీ, ఆ ప్రశాంత సమయంలో విన్పించలేదు.లిఫ్ట్‌ ఎక్కి మూడవ అంతస్తుకు చేరుకున్నారు. సంజీవప్ప, రాజ్యలక్ష్మి వెంట కారిడార్‌లో నడుస్తూ, అటూ యిటూ ఉత్కంఠగా చూస్తున్నాడు. ఆ కారిడార్‌కు ఆ పక్క మూడు, ఈ పక్క మూడు కుటుంబాలున్నాయి. తలుపులన్నీ తెరిచేవున్నాయి. సహజంగా, పట్టణాలలో ఇళ్ల తలుపులెపుడూ మూసే వుంటాయి. బెల్‌ కొడితే తప్ప తలుపులు తెరవరు. పరాయి వాళ్లెవరూ తమ ఇళ్లలోకి అడుగుపెట్టడాన్ని సహించని కాలం ఇది! పక్క ఇళ్లలో ఎవరుంటున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ల అతీగతీ ఏమిటో పట్టించుకోని రోజులు ఇవి. అలాంటిది తలుపులన్నీ తెరిచి వుండటమే గాకుండా, రాజ్యలక్ష్మిని పల్కరిస్తున్నారు ‘ఎవరు? ఏమిట’ని. రాజ్యలక్ష్మి వాళ్లతో ‘మా చిన్నాన్న, హైదరాబాద్‌లో వుంటున్నార’ని సమాధానాలు చెబుతూ అడుగులు వేస్తున్నది.