పూల మొక్కలకు నీరుపోసి పెంచి పూలు పూయించి ఆ పూలు రంగురంగుల చిరు నవ్వులు చిందుతుంటే చూచి ఆనందించేవేళ మరొకరు ఆ పూలను కోసుకొని పోతే హతాశుడయ్యే తోటమాలి ఒక వంక -అట్లా కోసుకు పోయినవాడు. గుండెల్లో భావంకంటే కండల్లో భావం చొప్పున ఆ పూలను అనుభవిస్తుంటే వాడి చేతుల్లో నలిగే ఆ అసహాయ కుసుమాలు వేరొక వంక -

ఈ రెండూ, ఎప్పుడూ కలవని రైలుపట్టాల్లా, నిరంతరంగా సాగి పోవడమే సంసారమేమో! భారతీయధర్మం ఈ బాధ భరించమని బోధిస్తుందేగానీ ఆ రెండింటికీ సమన్వయం ఏమిటో చెప్పదు.కొత్త కాపురం - తండ్రి కూతుర్ని తీసుకెళ్ళుతున్నాడు దిగబెట్టి రావడానికి.చీపురుపల్లి వరకూ తండ్రీ, హరిణ బస్సులో ప్రయాణం చేశారు. అంతదూరమూ హరిణ ప్రక్కనే కూర్చున్న తండ్రి ఏమీ మాట్లాడలేదు. ఏదో ఆలోచనల్లో నిమగ్నుడై ఉన్నాడు.సాయంకాలం అయింది. రోడ్డులో బస్సు ఆగింది. తండ్రి కూతురూ దిగారు. బస్సు వెళ్ళిపోయింది. ధూళి మేఘాలు రేపుకుంటూ - తండ్రి చుట్టూరా చూచాడు. భూమ్యాకాశాలు విశాలంగా కనుపించాయి. అంతా నీలంగా నిర్మలంగా ఉంది. దూరాన కొండలు, కొండలకు యివతల చేలల్లో దున్నుకుంటున్నారు. తండ్రికి జగత్తు నూతన చిత్రంగా కనిపించింది -‘‘ఏమ్మా వెడదామా?’’‘‘ఎంత దూరం నాన్నా?’’‘‘రెండు మైళ్ళమ్మా.

ఈ కొండమలుపు తిరిగితే ఊరు కనపడుతూ ఉంటుంది.’’హరిణ సంచి తీసుకుంది, తండ్రి చిన్నపెట్టె తీసుకున్నాడు. కొండప్రక్క పుంతలో నడక సాగించారు. కొండ పచ్చటి చెట్లతో పొదలతో సాంద్రంగా ఉంది. కొండ సానువులమీద ధేనువులు తెల్ల బిందువుల్లా సంచరిస్తున్నాయి. కొండశిరస్సు నీలాకాశంలో అందంగా గోచరిస్తూ ఉంది. అది చూస్తూ నడిచాడు తండ్రి. చాలుగా తెల్లటి కొంగలు ఎక్కడికో వెళుతున్నాయి. తండ్రికి చిన్ననాటి విషయాలు జ్ఞప్తికి వచ్చాయి.వాళ్ళ నాయనమ్మ పెంచింది ఆయన్ను. ఆవిడ వేపచెట్టుక్రింద మంచం మీద కూర్చుని కథలు చెపుతూ ఉంటే ఆయన పడుకొని నీలాకాశంలో ఎగిరే గరుత్మంతుడ్ని చూస్తూ వింటూ ఉండేవాడు అక్కడ్నించి, ఆయన చదువుకుంటున్న రోజులు, పెళ్ళి అవడం, తర్వాత హరిణ పుట్టడం, తాను ఒంటిరిగా పెద్ద చదువు కోసం విశాఖపట్నం వెళ్ళడం - ఇట్లా ఒకటి వెంబడి ఒకటి చిరకాలస్మృతులు తీసుకొని వచ్చాయి.