‘‘పారిపోతున్నానా? కొన్ని చోట్ల నిలవ నీరై మిగిలి వుంటున్నానా?’’ఆ చివరి వాక్యంతో ఆ రాత్రికి నోట్‌ బుక్‌ మూసేశాడు వినీల్‌. అలాంటి వాక్యాలు రాయడం అతనికేమీ ఇష్టం వుండదు. ఆ మాటకొస్తే, అసలు రాయడం అనే చర్యలోనే ఏదో మోసం వుందనుకుంటాడు. ఇప్పుడైతే మనుషులతో మాట్లాడడం కూడా అలాంటిదే అనే నిర్ణయానికి కూడా వచ్చేశాడు, మనీషతో ఆ చివరి సంభాషణ తరవాత.ఆ వొక్క వాక్యం రాశాక, డెస్క్‌ మీద కాసేపు వినీల్‌ చూపులు నిలిచిపోయాయ్‌. టేబుల్‌ అద్దం కింద వొకనాటి మిత్రుడు రాహుల్‌ అప్పుడెప్పుడో రాసిన వుత్తరం అందంగా పలకరిస్తోంది.

 డెస్క్‌ మీద వొక వైపు అమ్మానాన్నతో కలిసి దిగిన ఫోటో ఫ్రేమ్‌ లోంచి నిన్నటి జ్ఞాపకాలు. టేబుల్‌ మీద అంతకంటే ఎక్కువేమీ పెట్టుకోడు, అతని మనసులానే - చిన్న ప్రపంచమే ఇష్టం! మనీషతో కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్న ఫోటో కూడా పెట్టాలని మొదట్లో కొన్నిసార్లు అనుకున్నాడు. కానీ, ఆ ఫ్రేమ్‌ తయారయ్యే లోపే మనీష దూరమవుతూ వచ్చింది.‘‘విన్నీ, నాకు తెలిసీ నువ్వు ఎప్పటికప్పుడు భలే తప్పించుకు తిరుగుతూ వుంటావ్‌. వాస్తవాన్ని ఎదుర్కోవడం అంటే చాలా భయం నీకు. అమ్మ నుంచి రాహుల్‌ దాకా నువ్వు షేర్‌ చేసుకునే మాటల్లో ఏదో ఇమాజినరీ లోకంలో మాత్రమే బతుకుతున్నావనే తెలుస్తుంది. ఎందుకంటే, వాళ్ళ జ్ఞాపకాల కింద వర్తమానాన్ని దాచేయడంలో నీకేదో తృప్తిలాంటిది వుందనిపిస్తోంది’’ అని మహావేగంతో చెప్పేసింది.

ఆ ఫిర్యాదుతో మొదలయిన కాఫీ సంభాషణ చాలా దూరమే వెళ్లింది. మనీషకి కూడా తను అర్థం కాలేదనుకున్నాడు. అంతే! ఆ ఇద్దరి మధ్య దాదాపు పాతికేళ్ళ స్నేహం పుటుక్కున తెగిపోయింది.ఈ రాత్రి అవన్నీ నెమరేసుకోవడం అతనికి ఇష్టం లేదు.ముసురుకొస్తున్న ఆ జ్ఞాపకాలన్నీ పక్కకి తోస్తూ, వూరికే కూర్చుండిపోయాడు. ఎదురుగా అద్దంలోంచి నాన్న కనిపిస్తున్నాడు. నాన్నకి ముందు అతనికి అమ్మ కనిపించేది. పదేళ్ళ కిందట అమ్మ అనారోగ్యం వల్ల మంచానికి అతుక్కుపోయి, వుండిపోయినప్పుడు కూడా జీవం లేని అమ్మ కళ్ళు అతన్ని ప్రతిక్షణం గైడ్‌ చేసేవి. అమ్మ పోయాక నెమ్మదిగా ఆ స్థానంలోకి నాన్న వచ్చాడు. నెలలో సగం రోజులు నాన్న హైదరాబాద్‌ వచ్చి అతనితోనే వుండేవాడు. వినీల్‌ మాత్రమే లోకం అన్నట్టే వుండేవాడు. వినీల్‌ గురించి ఏదో భయం వెంటాడుతూ వున్నట్టే వుండేవాడు.