‘‘నువ్వు చేసిన పనికి తలెత్తుకుని తిరగలేకపోతున్నా.’’ఎక్కడో మారుమూల నొక్కిపెట్టేసిన జ్ఞాపకాల్లోంచి హఠాత్తుగా ఎగిరొచ్చింది సూదంటురాయి ఒకటి.గట్టిగా ఊపిరిపీల్చుకుని తల విదిల్చింది శశి. కంప్యూటర్లో టైపు చేస్తున్న డాక్యుమెంట్‌ను సేవ్‌ చేసి, కాఫీ కలుపుకోవడానికి కిచెన్లోకి నడుస్తూ ‘‘మేఘా, తినడానికి ఏమన్నా తెచ్చివ్వనా?’’ అని హాలుకు అవతల వున్న మేఘ గదిలోకి కేకేసింది.మేఘ ఏడవ తరగతి చదువుతోంది. 

కరోనా వల్ల సంవత్సరం నుంచి క్లాసులన్నీ ఆన్‌లైన్‌ లోనే జరుగుతున్నాయి. గట్టిగా అరిచి క్లాసు డిస్టర్బ్‌ చేశానేమోనని అనుకుంది శశి.‘‘ఇక్కడే ఉన్నానమ్మా.’’రైటింగ్‌ టెబుల్‌ పక్కనేత ఉన్న సోఫాలో ముడుచుకుని కూర్చునుంది మేఘ.శశి నవ్వేసింది, ‘‘నువ్వెప్పుడొచ్చావ్‌, నా చల్లని మబ్బు తునకా’’ మేఘ పక్కన కూర్చుంటూ అంది.‘‘ఇందాకే. పక్కన పిడుగుపడ్డా వినపడదేమో అన్నట్లు రాసుకుంటున్నావని డిస్టర్బ్‌ చెయ్య కుండా కూర్చున్నా. అయిపోయిందా పని?’’‘‘ఇంకొంచెం ఉందిరా. ఏదో సడన్‌గా గుర్తొచ్చి ఆలోచన తెగిపోయింది. కాఫీ చేసుకుందామని వెళ్తున్నా. నీకేమన్న చేసివ్వనా?’’‘‘వాక్‌కి వెళ్దామా? టెన్‌ మినిట్స్‌లోవచ్చేద్దాం.’’‘‘రిపోర్ట్‌ పని అయ్యాక వెళ్దామా?’’‘‘సరే’’ నెమ్మదిగా అన్నది మేఘ.

శశి, మేఘ వైపు చూసింది. మేఘ తల తిప్పేసుకునే లోపల తన ఉబ్బిన కళ్లను చూసేసింది.‘‘లేదులే, నాక్కూడా బ్రేక్‌ కావాలి. ఇప్పుడే వెళ్దాం పద’’ మాములుగా అయితే ఉత్సాహంగా లేచేది కానీ, ఈరోజు మెల్లగా కదిలింది మేఘ.మాస్కులు పెట్టుకుని బయటకు వచ్చారు. అప్పుడే వచ్చిన వసంతానికి పువ్వులు విరగబూసిన చెట్లు గాలికి మెల్లగా కదులుతూ ఒక వింత అందం అలుముకుని ఉంది. గాలికి ఎగురుతున్న వెంట్రుకలను కళ్ల మీద నుంచి చెంపల మీద జరుపుకుంది మేఘ. ముఖం శశికి కనిపించనివ్వకుండా జుత్తును సర్దుకుంది. అదంతా క్రీగంట గమనిస్తున్న శశి ఏం మాట్లాడకుండా ముందుకు నడిచింది.ఒక ఇంటి ముందు గడ్డిలో తెల్ల సీతాకోకచిలుక ఒకటి ఎగురుతూ కనిపించింది. తెల్ల సీతాకోకచిలుకలంటే మేఘకు భలే ఇష్టం. వసంతం వచ్చేస్తుందని చెప్పటానికన్నట్లు చలికాలం చివరి రోజుల్లో అప్పుడప్పుడే తలలెత్తుతున్న గడ్డిపువ్వుల్లో ఆడుకుంటూ కనిపిస్తాయవి. చలికాలం మళ్ళీ మొదలయ్యేంతవరకు కనిపిస్తూనే ఉంటాయి.