వేసవి వెళ్లిపోతూ వర్షాన్ని ఆహ్వానించింది. చిరుగాలితో కూడిన వర్షం అక్కడక్కడ చిరుజల్లులు కురిపించి ఆగిపోయింది. వేమవరప్పాడు రోడ్డు మీద రాలిన పొగడపూల తివాచీ మీద, తన పర్సనల్ సెక్రెటరీ శ్రీరామ్‌తో హుందాగా నడుచుకుంటూ వెడుతున్న రవికి, ‘‘రవీ.. బావున్నావా?’’ అన్న చిరపరిచితమైన గొంతువినబడింది.
ఆ పలకరింపుతో ఆగిన రవి, ఎదురింటి లోంచి బయటకు వచ్చినామెతో...‘‘బావున్నా అత్తా. మీరెలా ఉన్నారు? మావయ్య బావున్నాడా?’’‘‘అందరం బావున్నాం రవి. హైదరాబాద్ నుంచి ఎప్పుడొచ్చావు?’’‘‘ఉదయం వచ్చాను. మన స్కూల్‌లో చిన్న కార్యక్రమం ఉందత్తా’’ సమాధానమిచ్చాడు.‘‘రవి సార్‌కి స్కూల్ వారు సన్మానం చేస్తున్నారండి’’ శ్రీరామ్ చెప్పాడు ఆమెతో.‘‘అవునా! చాలా సంతోషం. అయ్యో.. రోడ్డు మీద నిలబెట్టే మాట్లాడేస్తున్నాను. ఇంట్లోకి రా నాయన. కాస్త కాఫీ తాగి వెడుదువుగాని!’’ హడావుడి చేయబోయింది.‘‘ఒద్దత్తా. టైము లేదు. మా ఇల్లు ఒకసారి చూద్దామనిపించి వచ్చాను, మళ్ళీ వచ్చినప్పుడు వస్తాను’’ అని చెప్పాడు.‘‘వెళ్ళు. ఈ టైములో మీ ఇల్లుకొనుక్కున్నవాళ్ళు ఉంటారు’’ అని లోపలికి వెళ్లిపోయింది.తన బాల్యం గడిచిన ఆ ఇల్లు చూడగానే ఒక్కసారిగా దుఃఖం పెల్లుబికింది రవికి. ఇంటికి కొన్నిమార్పులు చేశారనుకున్నాడు. తలుపులకు తాళాలు కనబడ్డాయి. ఇంట్లో వాళ్ళు ఎక్కడికో వెళ్ళినట్టున్నారు.ఉసూరుమంటూ ఇంటి అరుగు మీద కూర్చుండిపోయాడు.
బాస్ మొహంలో తేడా గమనించిన శ్రీరామ్, ‘‘సర్, ఎనీ ప్రాబ్లం?’’ అడిగాడు ఆతృతగా.‘‘నథింగ్. ఇక్కడ కాసేపుంటాను, మీరు మన రూమ్‌లో ఉండండి, అర్జెంట్ అయితే ఫోన్ చేయండి.’’‘‘ఒకే సార్’’ అని శ్రీరామ్ వెనుదిరిగాడు.‘‘అరుగుమీద కూర్చున్న రవికి తను, చిన్ననాటి స్నేహితుడు శేఖర్ కలిసి తమ ఇంటిముందు మెట్ల పక్కన కట్టిన చిన్న జారుడు బల్ల మీద నుంచి జారుతూ ఆడుకోవడం గుర్తుకొచ్చింది. అరుగుమీద వీధిలో ఉన్న బీద పిల్లలకి నాన్న ఉచితంగా పాఠాలు చెబుతూ ఉండేవారు, ఆ అరుగుని ఆప్యాయంగా తడిమేడు.‘‘ఎవరు సారు తమరు?’’ ఇంటి యజమాని గంగాధరం తాళం తీస్తూ అడిగాడు.‘‘నేనండి రవిని. మీకు చాలాకాలం క్రితం ఈ ఇల్లు అమ్మేము కదా! సూర్యనారాయణ మాస్టారి గారి అబ్బాయిని.’’