బ్రహ్మ దేవుడు కాకుండా ... ఏ మణిరత్నమో, గౌతం మీననో వారి తలరాతలు రాసినట్లు కలర్‌ఫుల్‌గా గడుస్తున్నాయి ‘భారతి టవర్స్’లో ఉంటున్న వాళ్ళందరి జీవితాలు.వారంతా అప్పర్ మిడిల్ క్లాస్ యోగులు. నెలకొకసారి కామం, ట్రాఫిక్లో క్రోధం, దసరా మామూళ్ళప్పుడు లోభం, అమెజాన్లో అమ్మే వాటన్నిటిమీదా మోహం, అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ సత్యం మీద మదం, ఎనిమిది గంటలు నిద్ర పోగలిగిన వారి మీద మాత్సర్యం ప్రదర్శించి అరిషడ్వర్గాలచే జయింపబడతారు.వారెవరికీ టైం లేదు.
కానీ కార్ పార్కింగ్ స్పేస్ గురించి, కుక్కపిల్ల మొరుగుళ్ళ గురించి, ఇరుగూ పొరుగుతో గొడవపడడానికి మాత్రం కొంత సమయం తప్పక కేటాయిస్తారు. అంతకన్నా పెద్ద గొడవలుంటే రెండు నెలలకొకసారి సెల్లార్లో జరిగే మీటింగుల్లో తేల్చుకుంటారు.అలాంటి ఒక అపార్ట్‌మెంట్ మీటింగ్‌లో కూర్చుని జమాఖర్చులన్నీ ఏకరువు పెట్టుకున్నాక, వారి అపార్ట్‌మెంట్స్‌కి మాత్రమే చెందిన విచిత్రమైన రూల్ కోడ్ గురించి చర్చించుకుంటున్నారు.‘‘ఇలాంటి రూల్స్ వల్ల నా ఫ్లాట్లో రెంటుకున్న ఫ్యామిలీ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ‘‘గిజిౌ ఠీజీజూజూ ఛిౌఠ్ఛిట ఝడ జూౌటట?’’ అని మొదలుపెట్టాడు 206 ఎ బ్లాక్, తనకు బి బ్లాక్‌లో ఉన్న ఇంకో ఫ్లాట్ గురించి.ఆ ప్రశ్న ఎదుర్కున్న అసోసియేషన్ ప్రెసిడెంట్ మనోహర్ ఏం చెప్పాలో తెలిసినా ముందే సమాధానమిస్తే కన్‌క్లూడ్ చెయ్యాల్సొచ్చినప్పుడు పాయింట్స్ దొరకవేమో అని భయపడుతున్న వాడిలా మౌనంగా ఉన్నాడు.
ఊరకనే ఉంటే బాగోదేమోనని లిఫ్ట్ పక్కన గోడ మీద అంటించిన రూల్ బోర్డ్‌ని చూడ్డంలో నిమగ్నమయ్యాడు.ఈ కింది వ్యక్తులు లిఫ్ట్ వాడినచోరు.1000/- జరిమానా:1. గ్యాస్ డెలివరీ ఏజెంట్2. పనిమనిషి3. పేపర్ డెలివరీ బాయ్4. ఇస్త్రీ అబ్బాయి5. బాత్రూం క్లీనర్‌పనిమనుషుల్ని లిఫ్ట్ వాడనివ్వకపోవడం వల్ల పడాల్సిన అగచాట్లు అవగతమయ్యాక ఇలాంటి ఒక మీటింగ్‌లో వాళ్ళని మినహాయించారు. పేపర్ తెప్పించే కొద్దిమందీ వాళ్ళ మెయిల్ బాక్స్‌లో పేపర్ పడెయ్యమని డెలివరీ బాయ్స్‌కి చెప్పేసి సరిపెట్టుకున్నారు. ఎక్కువమంది బట్టల ఇస్త్రీ వాచ్‌మెన్ సత్యం చెయ్యడం వల్ల అతనికి ఎటూ లిఫ్ట్ ఏక్సిస్ ఉంటుంది కాబట్టి బయటి ఇస్త్రీ వాళ్ళని అనుమతించకపోవడం పట్ల ఎవరికీ ఏ ఇబ్బందీ లేదు. ఇప్పుడు గొడవంతా గ్యాస్ డెలివరీ చేసే వాళ్ళు, బాత్రూం క్లీనర్స్‌ని లిఫ్ట్ వాడనివ్వకపోవడం గురించే.