‘‘నీలా! ఎట్టుండావు? బాగుండావా మే?‘నువ్వు లేకుండా, నిన్ను చూడకుండా నేను ఎట్టా బాగుంటా? అంటాండావు కదా! ఇంగా ఇన్నాళ్ళకు గుర్తుకొచ్చినానా?’ అని గదా నిష్టూర పోతాంటావు. నాకు తెలుసులేమ్మే నీ మనసు. ఏం చేసేది. దేముడు మన మొగానిట్టా రాసి పెట్టినాడు. ఈ పొద్దు పెద్దపండగ గదా! పండగ నాడన్నా నీ దగ్గరకు రాకపోతే ఎట్లని మనసు కొట్టకలాడే!నీలా!
ఈ పొద్దు సుక్కురారం కదా. సుక్కురారం ... సుక్కురారం.. తలకు నీళ్లు పోసుకుని, మొగమంతా పసుపు పూసుకుని, నొసట్న ఇంత పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుంటే సాలు.. లచ్చిందేవి మాదిరి నువు కళకళలాడి పోతాంటివి. ఇదో నీలా! నీకు మల్లెపూలంటే ఇష్టమని తెచ్చినా చూడు! ఒక మూర ముప్పై రూపాయలంట! పోతే పోనీ లే. పండగ గిరాకి కదా! దినాము కొంటాండామా ఏందీ! నీకు దుడ్లు అనావసరంగా కర్చు పెట్టడమంటే ఇష్టం ఉండదని నాకు తెలుసులే.‘మన ఇంటి కాడ గుండు మల్లెలు, నిత్తె మల్లెపూలు పూస్తాయి కదా! మళ్లీ కొని తెచ్చిండేదెలా’ అంటాండావు కదా! యాడమే.. ఆ చెట్లన్నీ ఎప్పుడో ఎండిపోయాయి. నువ్వు ఎప్పుడు మంచాన పడితివో అప్పుడే వాటికి దిగులు పుట్టి పోయ!నీళ్ళు పోసినప్పుడు, మొగ్గలు కోసినప్పుడు, పాదులు చేసేటప్పుడు, ఎండాకులు తుంచేటప్పుడు... వాటితో నువ్వు మనిషితో మాట్లాడినట్లు మాట్లాడతా వుంటివి కదా! చాలామంది పల్లె జనాలు, ఇంట్లో వాళ్ళు... నువ్వు అట్లా చెట్లతో మాట్లాడేది చూసి నవ్వతా వుండిరి. గేలి గడా చేస్తాండిరి. అయితే నువ్వు అదేమీ పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసే దానివి.‘చెట్లు, పసువులు మన లాగ మాట్లాడలేవు గానీ మనం చెప్పేది వాటికి అర్థం అవుతాయి. అయినా... మా మాటలు మాకు అర్థం అయితే చాలు. మధ్యలో మీకేం బాధ?’ అనే దానివి.నిజమే నీలా! నువ్వు చాలా తెలివిమంతు రాలివి. బుద్ధి, ఓర్పు అన్నీ ఎక్కువే ఇచ్చినాడు దేముడు నీకు. తన - మన అని లేకుండా అందరిని అక్కరగా చూసుకునే నీతో పసువులు, మొక్కలు కూడా అంతే అక్కరగా మాట్లాడుతాయంటే ఆశ్చిరికమేముందిలే నీలా!