భళ్లుమన్న శబ్దానికి ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్లు తెరిచాడు వాచ్మెన్. తనకు కొద్ది దూరంలో కంప్యూటర్ మానిటర్, సిపియు, కీబోర్డ్ పగిలి పడి ఉన్నాయి. వాటిల్లో ఒక ముక్క తన కాళ్లకు తాకింది కూడా. ఆశ్చర్యంతో అవి ఏ ఫ్లోర్ నుంచి పడ్డాయో అర్థం కాక బిక్క మొహంతో పైకి చూశాడు. ఎవరూ కనిపించలేదు. ఇంతలో ఇంటి సరుకుల కోసం బజారుకు వెళ్లి తిరిగి వచ్చిన రమణ టూ వీలర్‌ను అపార్ట్మెంట్ పార్కింగ్‌లో పెట్టి, కంప్యూటర్ ముక్కలు చూస్తూ ‘‘వీటిని ఇక్కడెవరు వేసిండ్రు యాదగిరి?’’ అన్నాడు, మాస్కును కొంచెం కిందికి జరిపి, కళ్లజోడు సరిచేసుకుంటూ.
‘‘ఏమో సార్! ఇప్పుడే ఎవరో పై నుండి కింద పడేసిండ్రు. నేను అదే సూస్తున్న ఎవరేసిండ్రోనని’’ అన్నాడు దూరంగా పడ్డ కీబోర్డు ముక్కనొకదాన్ని తీసుకొస్తూ.రమణ ప్రగతి అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోషియేషన్ అధ్యక్షుడు. ఒక కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. బయట లాక్డౌన్ నడుస్తుండడంతో వారం పది రోజుల తరువాత ఇవాళే సరుకులైపోయాయని బజారుకు వెళ్లి మళ్లీ పదిహేను రోజులకు సరిపడ సరుకులు తీసుకొని వచ్చేసరికి ఊహించని విధంగా కనిపించింది పగిలిన కంప్యూటర్.‘‘సరే, యాదగిరి.. ఎవరు వేశారో తెలుసుకో. నేను కూడా ఆరా తీస్తాను. అసలేం జరిగిందో’’ అని సరుకుల సంచి బలవంతంగా లిఫ్ట్ దాకా లాక్కెళ్లాడు. తనుండేది ఐదో ఫ్లోర్లో. లిఫ్ట్ ఎదురుగానే తన ఫ్లాట్. సంచి కిందికి దించి కాలింగ్ బెల్ నొక్కాడు.
కొద్దిసేపటికి తలుపు తెరిచిన నానీగాడు అదో రకంగా మొహం పెట్టి ‘‘తాతయ్య.. నాయనమ్మ బెడ్రూంలోకి పోయి తలుపేసుకుంది. చాలా సేపైంది’’ అన్నాడు.కొడుకు వాసు సాఫ్ట్వేర్ ఇంజనీర్. వర్క్ ఫ్రం హోంలో భాగంగా లాప్టాప్ పట్టుకొని కూర్చున్నాడు. కూతురు చైత్రిక - ఆమెది ఇంటర్మీడియెట్ అయిపోయింది. జెఈఈ మెయిన్స్ కు ప్రిపేరవుతూ ఏదో కార్పొరేట్ కాలేజీ వాళ్లు అందించే వీడియో లెసన్స్ వింటోంది. కోడలు నీరజ ఏదో ప్రైవేట్ స్కూళ్లో సైన్స్ టీచర్. సెల్లో జూమ్ ఆప్ ద్వారా వీడియో లెసన్ చెబుతోంది. నానీగాడు థర్డ్ క్లాసు. వాడు కూడా వీడియో లెసన్స్ వింటున్నాడు. వింటున్నాడంటే సెల్ ఆన్ చేసి పెట్టి కుక్క పిల్ల ‘మ్యాగి’తో ఆడుకుంటున్నాడు.