రాణివాసం రతనాల సోయగంతో వెలుగొందుతుంది.దారికిరువైపులా పూలవనం. చక్కని పూపొదల సాబగులు ఆస్వాదిస్తూ ఆమడదూరాన రాచఠీవీ ఒలకబోస్తున్న ఆ మందిరాన్ని చేరాడు తిమ్మన. ద్వారపాలకులు వినమ్రంగా సమస్కరించి అంతఃపుర ద్వారంలోకి స్వాగతించారు. విశాలంగా పరుచుకున్న మంటపం లో నుండి మరో మందిరంలోకి దారిచూపారు భటులు.

రత్నకాంతులు వెదజల్లుతున్న ఆ మందిరం మధ్యలో విలాసవంతంగా అమరియున్న ఆసనాలు. ఎటుచూసినా రాచమందిరపు సొబగులు.. కస్తూరికాద్రవ్య పరిమళాలు. రాయలవారి వీరవిలాస చిహ్నాలకు దర్పణంలా వెలుగొందుతున్న ఆ మందిరంలోకి ప్రవేశించి సందేహాస్పదుడై పరిసరాల్ని పరిశీలించాడు.ఇంతలో పరిచారిక ప్రవేశించి.. తిమ్మనకు వంగి నమస్కరించింది.‘‘కవివరేణ్యులకు వందనాలు.’’తిమ్మన ప్రతినమస్కారం చేస్తూ ‘‘బాగున్నావా.. చరికా?’’ అన్నాడు.రాణివాసపు చెలికత్తెలతో అంతగా పరిచయం లేకున్నా రాణీవారి అనుంగు చెలికత్తెగా చరిక తనకు సుపరిచితమే.చరిక అవునూ కాదన్నట్లు తలవూపి ‘‘మీరు వచ్చిన సమాచారం దేవేరికి తెలియజేస్తాను, నిరీక్షించండి..’’ అంటూ లోనకేగింది.తిమ్మన మదిలో రకరకాల సందేహాలు సుళ్లు తిరుగుతున్నాయి. అడపాదడపా ఆ మందిరానికి రాయలవారితో అడుగు పెట్టిన సందర్భాలున్నాయి తప్ప ఇన్నేళ్లలో తను సొంతంగా అడుగుమోపిన దాఖలాల్లేవు.అయితే.. రాణివాసపు దేవేరి, రాజుగారి పట్టమహిషి తనను స్వయంగా పిలిపించడం ఆశ్చర్యానికి లోనుచేస్తుంది.

మహారాణి సత్కవిగా తనను మెచ్చి అభినందించడానికి పిలిపించిందా? అదే అయితే రాజుగారి సమక్షంలోనే అభినందించేవారు. అలాంటి వాతావరణమేమీ గోచరించడం లేదు. పైగా రాణీవారే ఏదో అశాంతిని ఎదుర్కొంటున్నట్లు తోస్తుంది. దేవేరి మందిరమే కాదు.. చెలికత్తె ప్రవర్తన కూడా తనను అసౌకర్యానికి గురిచేసింది.అతను నవ్వుకున్నాడు. అయినా తను.. సాధించగలిగిన రాచకార్యా లేముంటాయి?!తిరుమలాదేవి సాక్షాత్తూ విజయనగర ప్రభువులు శ్రీకృష్ణదేవరాయలవారి పట్టమహిషి. మహారాజ్ఞి. రాణివాసపు కార్యాల్లో తను తలదూర్చగలడా?తల విధిలించాడు తిమ్మన. తనపై తనే జాలిపడ్డాడు. అప్పుడే తనేదో రాచకార్యం వెలగబుచ్చుతున్నట్లు.. అదీ.. తను చేయగలనా లేదా అని తర్జన భర్జన పడడం. కాసేపు తన ఆలోచనలకు తానే సిగ్గుపడ్డాడు.ఇంతలో దేవేరి ప్రవేశించింది చరికతో సహా.తిమ్మనను చూడగానే మొహంలో తనవారిని చూసిన ఆత్మీయత పొడమింది. ప్రకాశవంతమైన మొహంతో ‘‘కవి వరేణ్యులు క్షేమమా?’’ అని ప్రశ్నించింది.అతను రెండు చేతులెత్తి నమస్కరిస్తూ ‘‘మహారాణివారు ఈ తిమ్మన్న ప్రణామాలు స్వీకరించాలి’’ అని మొక్కాడు