అమెరికా నుంచి వచ్చిందో ఉత్తరం.. ఆ దేశంలో తనకు తెలిసిన వాళ్లు కానీ.. మిత్రులు, బంధువులు కానీ ఎవరూ లేరే.. అనుకుంటూనే ఆ ఉత్తరాన్ని చదివాడతను. ఉత్తరం చదివిన తర్వాత అతడు విస్తుపోయాడు. వాళ్లెవరో తెలీకపోయినా.. తమతో బంధుత్వం కలుపుకోవాలని ఉందంటూ లేఖ రాయడాన్ని చూసి.. షాకయ్యాడు.. అసలు కథేంటంటే..

******************* 

 

రాత్రి 8 గంటలైంది. రఘునాథశర్మ, అతని తల్లి, అన్నగారు, వదిన శ్యామల పెళ్ళిచూపులకు వెళ్ళి వచ్చారు.‘‘అమ్మాయి ఎలా ఉందిరా’’ తల్లి ప్రశ్న.‘‘బాగానే ఉందిగా’’ శ్యామల సమాధానం.‘‘అన్నీ బాగానే ఉన్నాయి, అయ్యే యోగం ఉంటే. రఘు నువ్వేం మాట్లాడవేం రా’’ తండ్రి పురుషోత్తం అడిగారు. హాలులో అందరూ పెళ్ళివారింటి విశేషాలు, పెళ్ళిచూపుల గురించే మాట్లాడుకుంటున్నారు. రఘు అక్కడి నుండి ముభావంగా లోపలికి వెళ్ళిపోయాడు. లోక కళ్యాణ కార్యక్రమాలుచేసే పౌరోహిత్యాన్ని వృత్తిగా స్వీకరిస్తే మంచిపేరు వస్తుందేమోగాని ఈ రోజుల్లో ఇటువంటి ఇంటికి కోడళ్ళుగా మాత్రం ఎవరూ రావటం లేదు.

28 సంవత్సరాల వయసులో రఘుకి ఇప్పటివరకు ఐదారు సంబంధాలు వచ్చాయి. అవి కూడా అతని రూపంచూసి, అతని ఉండే ఇంటిని చూసి వచ్చినవే. అతని వృత్తి వివరాలు విన్నాకమాత్రం వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఇంటిముందు డాక్టరు రఘునాథశర్మ అనేపేరు చూడగానే మంచి పెళ్ళికొడుకు అనే నిర్ణయానికి వచ్చేస్తారు. నిజంగా కూడా అతను మంచిపెళ్ళికొడుకే. కాని వైదికవిజ్ఞానాన్ని అధ్యయనంచేసి డాక్టరేట్‌పొందిన రఘు మంచి స్ఫురద్రూపి. పచ్చటిఛాయ, ఆరడగులపొడుగు, క్రమశిక్షణ కలిగిన శరీర సౌష్టవం. అమ్మాయిలు ఇట్టే పడిపోతారు. రఘు సదస్యుడి దుస్తులు ధరించి వెళినప్పుడు, ఆ దుస్తుల్లో చూసినట్లయితే అతడికి పెళ్ళైపోవడం ఖాయం అనిపిస్తుంది. ఆస్తి కూడా అంతో ఇంతో బాగా కలిగినవాడే.వంశపారంపర్యంగా తండ్రి నుంచి వచ్చిన వృత్తిధర్మం అతడి వైదిక విజ్ఞానం. తప్పనిసరి దారి. అదే బ్రతుకుబాట కావాలని, చిన్నప్పటినుంచీ వేద పాఠశాలలో ఒకవైపు వేదం, మరోవైపు మామూలు పాఠశాలలో ఆంగ్లవిద్య రెండూ నేర్పించారు. ఏకకాలంలో రెంటిలోనూ పట్టభద్రుడు రఘునాథశర్మ.తిరుపతి వేదిక్‌ విశ్వవిద్యాలయంలో పి.హెచ్‌.డి.కి దరఖాస్తు చేసుకుంటే వచ్చింది. హాస్టల్‌లో ఉండి కష్టపడి మూడేళ్ళు రాత్రి పగలు పుస్తకాలతో సమరం చేసి గడువులోపు పి.హెచ్‌.డి. సమర్పించాడు. అంతవరకూ బాగానే ఉంది.