బంగాళాఖాతంలో వాయుగుండం తుపాన్‌గా మారుతోందట! నా మనసులో పరిస్థితి కూడా అలాగే వుంది. ఇప్పటికే లోపల వాయుగుండం సుడులు తిరుగుతోంది. అది తుపాన్‌గా మారే సమయం రాబోతోందని అనిపిస్తోంది!ఒకసారి నా డాక్టర్‌ మిత్రుడితో మాట్లాడదామని ఫోన్‌ చేశాను. ఏవో గోలగోలగా శబ్దాలు వినిపించాయి.

 ‘థియేటర్‌లో వున్నాను. సినిమా చూస్తున్నాను..’ అని జవాబు వచ్చింది. నాకు ఒళ్ళు మండింది. అయినా నా సమస్య అతడికెలా సమస్య అవుతుంది? ఏదో నేను కాస్త డిప్రెషన్‌లో వుంటే నా చుట్టూ వున్నవారు కూడా అలాగే వుండాలా ఏమిటి?‘‘ఏం సినిమా?’’ అడిగాను.‘‘చావడానిక్కూడా తీరిక లేదు..’’ అన్నాడు అవతలినుంచి ఆనంద్‌.‘‘అదేంటి?’’ అయోమయంగా అడిగాను.‘‘అదేరా .. ‘నో టైమ్‌ టు డై’ అనే ఇంగ్లిష్‌ సినిమా! జేమ్స్‌ బాండ్‌ పిక్చరు.. మొదట వచ్చినప్పుడు మిస్సయ్యాను. ఈ ఽథియేటర్‌లో మళ్ళీ రిలీజ్‌ చేశారు’’ అన్నాడు.‘ఓహ్‌ అదా..’ అనుకున్నాను.ఎందుకో నా చుట్టూ వున్నవారంతా సంతోషంగా వున్నారనీ, నేనే ఇలా సతమత మవుతూ వున్నాననీ అనిపిస్తోంది. నాకంటే అందరూ ఆనందంగానే వున్నారనే ఫీలింగ్‌!తలగడ ఎత్తుగా పెట్టుకుని పక్కమీద వాలాను. ఫోన్‌ తీసుకుని వాట్సాప్‌ తెరిచాను. అన్ని గ్రూపుల్లో ఏవేవో పోస్టులు. అసలు కొన్ని గ్రూపుల్లో పోస్టులు చూస్తే మనుషులు ఇంత ఖాళీగా కూడా వుంటారా అనిపిస్తుంది! కాకపోతే ఆ గ్రూపులో ఎవరో మనల్ని జాయిన్‌ చేశాక మనం ఎగ్జిట్‌ అయిపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అన్న ఫీలింగ్‌తో అలాగే కంటిన్యూ అయిపోతుంటాను.

కాసేపటికే వాట్సాప్‌ బోర్‌ కొట్టింది. సాధారణంగా ఎక్కువ సమయం నేను పుస్తకాలు చదవడంలోనే గడుపుతుంటాను. బోర్‌ కొడితే పాటలు వింటాను. యూట్యూబ్‌లో పాత సినిమాలు చూస్తుంటాను. ఇక కథారచన అనేది నాకిష్టమైన వ్యాసంగం. ఇప్పుడు నేనున్న మానసికస్థితిని కాసేపు మర్చిపోయి ఏదో ఒక వ్యాపకంలో కాసేపు మునిగిపోతే కానీ లాభం లేదని అనిపించింది.యూట్యూబ్‌ ఓపెన్‌ చేసి చార్లీచాప్లిన్‌ మూవీ ‘మోడరన్‌ టైమ్స్‌’ చూడటం మొదలుపెట్టాను. ఆ సినిమాలో ఫస్ట్‌ షాటే చాప్లిన్‌ సృజనాత్మకతకు ఒక మచ్చుతునకగా అనిపిస్తుంది. ఒక గొర్రెల మంద హడావిడిగా వస్తుండడం మొదట చూపిస్తారు. ఆ వెంటనే సబ్‌ వే నుంచి ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు గుంపుగా వస్తుండడం కనిపిస్తుంది. సినిమాలో అతడు చెప్పబోయే కథని ఈ ఒక్క షాట్‌ సింబాలిక్‌గా చెప్పేస్తుంది. కార్మికుల్ని ఎంత గానో కష్టపెట్టి యంత్రాల్లాగా పని చేయిస్తారు.. అన్నది ఆ సినిమాలో చూపిస్తారు.