‘హెల్సింకి ఇంటర్‌ నేషనల్‌ ఏర్‌పోర్ట్‌’లో ఉన్నాం నేనూ, లక్ష్మి.ఈ ప్రయాణం చాలా ముందుగానే నిర్ణయించబడింది. మా అమ్మాయి వసంతను ఈ స్థితిలో ఇక్కడే వదిలి వెళ్లడానికి లక్ష్మి అసలు ఒప్పుకోలేదు. వీసా 90 రోజులకు మించి ఇవ్వకపోవడంతో వెళ్ళి మళ్ళీ రావాలనుకున్నాం. వసంతకి ఏడో నెల. ఆమెను వదలలేక వదలలేక భారత్‌కి ప్రయాణమయ్యాం ఫిన్‌లాండ్‌ నుంచి.

అల్లుడు విష్ణు తను ఇంట్లోనే ఉండి వసంతను కంటికి రెప్పలా చూసుకుంటానని హామీ ఇచ్చిన తర్వాత లక్ష్మి కొంచెం సమాధానపడింది.కోవిడ్‌- 19 ఒక పాండెమిక్‌ అన్న ప్రకటన వెలువడిన రెండు రోజులలోనే మన దేశానికి వచ్చే పర్యాటకుల వీసాలు రద్దు చేసేసింది భారత ప్రభుత్వం. విదేశీయులు మన దేశానికి రావడానికి అడ్డుకట్ట వేసింది. కాకపోతే మా లాంటి వాళ్ళను స్వదేశానికి రావడానికి మాత్రం అడ్డు చెప్పలేదు. కొంతలో కొంత నయం అనుకున్నాను.మా ఫ్లైట్‌కి బోర్డింగ్‌ మొదలవ్వడంతో ఒక మీటర్‌ దూరం పాటిస్తూ మెల్లమెల్లగా క్యూలో ముందుకి సాగాం. మాటి మాటికి నా వైపు కళ్ళ నీళ్ళతో చూస్తోంది లక్ష్మి. మేకపోతు గాంభీర్యం తెచ్చుకుని, ‘‘ఏమిటి అలా బెంబేలెత్తిపోతున్నావు.. ఏమీ కాదులే’’ అన్నాను కళ్ళెగరేస్తూ.చేతిరుమాలుతో కళ్ళు ఒత్తుకుంది.

సమాధానం ఇవ్వలేదు. జాలిగా చూసి, ‘‘సరేలే కాసేపు విశ్రాంతిగా కూర్చో. ఏదైనా సినిమా చూస్తావా’’ అన్నాను.‘‘వద్దు లలిత చదువుకుంటాను’’ అంది.కళ్ళు మూసుకుంటే చాలు ఆమె మనసులో ఘంటానాథంలా లలితా సహస్రనామం జరుగుతూనే ఉంటుంది. ఆ అమ్మవారే కాపాడాలి, వసంతనే కాదు అందరినీ. ఇప్పుడు అందరూ బాగుండాలి అన్న కోరిక చాలా నిజాయితీగా వస్తోంది మనసులో. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వారు కూడా ఈ వైరస్‌ బారిన పడకుండా ఉంటేనే మనం క్షేమం అని అందరికీ అర్థమైపోయింది. చిటికలో ఎంత మార్పు ఆలోచనలలో, ప్రవర్తనలోనూ!‘ఇంకా ఎన్ని చూడాలో’ అనుకుని, స్టార్‌ వార్స్‌ మూవీ పెట్టుకుని చూడసాగాను. సైన్స్‌ని నమ్ముకున్న వారిలో నేనొకడిని!‘‘ఆకలేస్తోందండీ’’ అంది హఠాత్తుగా లక్ష్మి.నాకూ ఆకలి గుర్తుకొచ్చింది. దుబాయ్‌ ఏర్‌ పోర్ట్‌లో ముందుగానే ఒక ఏర్‌పోర్ట్‌ లాంజ్‌లో ప్రైౖవేట్‌ కాబిన్‌ తీసుకున్నాను. కావలసిన ఫుడ్‌ కూడా వేడి వేడిగా వండి తెచ్చిపెట్టేలా ముందుగానే ఏర్పాటు చేసుకున్నాను.