చేదిరాజ్య పాలకుడు శ్రీముఖుడు, మంత్రి కలిసి మారువేషంలో వెళ్ళి ఒక వ్యక్తిని కలిశారు. అతడు అచ్చుగుద్దినట్టు మహారాజునే పోలి ఉన్నాడు. మహారాజులాగా నడుస్తున్నాడు. అతడి నైపుణ్యన్ని, తెలివితేటలను, సామర్ధ్యాన్ని కూడా అతడు సాధించగలిగాడు. కానీ సామాన్యమానవుడిలా ఉంటూ రాజంతడివాడైన ఆ వ్యక్తిని చూసి రాజు శ్రీముఖుడు ఆశ్చర్యపోయాడు. ఆ పరవశంలో మహారాజు పెద్ద తప్పు చేశాడు. ఏమిటా తప్పు? నిజంగా అది తప్పేనా?…...
పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్లి, చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘‘రాజా, రాజధానిలో ఉన్నప్పుడైతే నువ్వు రాజువని తెలియడానికి నీ తలపై కిరీటం ఉంటుంది. ఎవరో సిద్ధుడికోసం ఈ అపరాత్రివేళ నువ్వు ఇక్కడికి వచ్చినా, కిరీటాన్ని ధరించి రావలసింది. ఎందుకంటే ఏ రాజుకైనా పరిపాలనాసామర్థ్యం ఎంత ముఖ్యమో మకుటంకూడా అంతే ముఖ్యం.
ఒకవేళ నీకు ‘మకుటంలేని మహారాజు’ అనిపించుకోవాలన్న కోరిక ఉంటే, కిరీటాన్ని అంతఃపురంలో వదిలి వచ్చావేమో నాకు తెలియదు. అప్పుడు వేరెవరో నీ మకుటాన్ని ధరించి నీకు ప్రమాదం తలపెట్టే అవకాశం ఉంది. అలాంటివాళ్లని మకుటంలేకుండా ఎదిరించడం నీవల్ల అవుతుందా? ఒకప్పుడు మకుటంలేని మహారాజుగా చెలామణీ అయిన వీరపాలుడికి ఇలాంటిచిక్కే వచ్చింది. శ్రమతెలియకుండా నీకు ఆ కథ చెబుతాను. విను’’ అంటూ ఇలా చెప్పసాగాడు.ఒకానొకప్పుడు చేది రాజ్యాన్ని శ్రీముఖుడనే రాజు పరిపాలించేవాడు. ధైర్యసాహసాల్లో, శౌర్యప్రతాపాల్లో, దానధర్మాల్లో అతడికి అతడే సాటి. అతడి పాలనలో ప్రజలు సుఖంగా ఉన్నారు. శ్రీముఖుణ్ణి ప్రజలు భగవంతుడికంటే ఎక్కువగా భావించి గౌరవిస్తున్నారు. శ్రీముఖుడి మంత్రి చతురుడు. చేది రాజ్యపు వైభవానికి చతురుడి బుద్ధిబలం కూడా ఒక కారణం.శ్రీముఖుడు నిత్యం తన మెడలో ఓ హారాన్ని ధరించేవాడు. ఆ హారం చేదిరాజులకు వంశపారంపర్యంగా వస్తోంది. జయహారం అనబడే ఆ హారం దగ్గర ఉన్నంతకాలం రాజుకి ఏ సమస్యలూ ఉండవని రాజవంశీకుల నమ్మకం. చూడ్డానికి సామాన్యంగా కనబడే ఆ హారం నిజానికి ఎంతో విలువైనదన్న విషయం శ్రీముఖుడికి కూడా తెలియదు. ఒకసారి కాశ్మీరదేశంనుంచి వచ్చిన ఓ వ్యాపారి రాజుమెడలో హారాన్ని చూసి, ‘‘ఇది అపురూపమైన హారం. ఇందులో మలచబడ్డ మణులకు వెలకట్టడం నాబోటివాడి వల్లకాదు. ఇలాంటి హారాన్ని మరొకటి తయారు చెయ్యడం అసాధ్యం. ఇది చూసిన నా జన్మ ధన్యమైంది. తమరు దీనివిషయంలో జాగరూకులై ఉండాలి’’ అన్నాడు.