పది అడుగులు దూరంగా వుండగానే తెలిసింది, పార్కు కొంచెం సందడిగానే వుందని. పిల్లల పరుగులు! తల్లుల కేకలు! తండ్రుల కబుర్లు రాజకీయాల మీద!ఆదివారం కదా? సాయంత్రం వేళే! వొణికించే చలి బాగా తగ్గింది.పార్కులోకి కాలు పెట్టిన కళాకుమారి, తను ఇష్టపడే రాతి మెట్లవేపు దూరం నించి చూసింది. 

అక్కడ ఎవరైనా వున్నారా, మెట్లు ఖాళీగానే వున్నాయా - అని! అక్కడ ఎప్పుడో ఏదో పాకిందని అక్కడికి ఎవ్వరూ చేరరు.కళాకుమారి మొహం మీద చిన్న నవ్వు మెరిసింది. గబ గబా మెట్ల దాకా నడిచి, ఆ క్రోటన్‌ చెట్లలోకి సందేహంగా చూసి, సంతోషంగా, చేతిలో పత్రికని పై మెట్టు పైన పెట్టి, తను కింది మెట్టు మీద కూర్చుంది.చేతిలో పుస్తకం ఒడిలో పెట్టుకుని, పత్రికని చేతుల్లోకి తీసుకుంది. ఆనాటి పత్రికే అది. పేజీలన్నీ ఒకసారి తిరగేసినవే.పొద్దున్న పత్రిక విప్పగానే, పత్రికలో కనపడ్డ స్వాములారి చేష్టల్ని అమ్మకీ, అమ్మమ్మకీ చెప్పాలని అనుకుంటూ వుంటే, అమ్మమ్మ గట్టిగా పిలిస్తే, దినపత్రికతో లోపలికి వెళ్ళింది. ‘‘అమ్మమ్మా! ఆ స్వాములారు యాగం గోతిలో నెయ్యి పోయించేశాడంట!’’ అంది కోపంగా.అమ్మమ్మ, చేతుల్లో వున్న నాలుగు పాత చీరలు మనవరాలి మీద పడేసి, ‘‘చూడమ్మా కళా! కుచ్చిళ్ళ దగ్గిరే చిరుగుళ్ళు! మిషను మీదే కదా? కాస్త కుట్టి పెట్టమ్మా తల్లీ! ఈ పూటకే కావాలి.

యేంటీ, నేతిని గోతుల్లో పోశారా? ప్రతీసారీ ఇదే పని పూజల్లో! నెయ్యంతా పేద పిల్లలకి పంచితే ఎంత పుణ్యం! ఆ దుష్టుడికి పాపం తప్పదులే. సరేగానీ అమ్మా! ఒక్క చీరన్నా కుట్టి పెట్టు!’’ అంది.కళ, చేతిలో పత్రికని పక్కనే బల్ల మీద పెట్టి, ‘‘కుడతాలే గానీ, ఆ స్వాములాళ్ళు ఇంకా చేరారక్కడ! చదువుతాలే. అది కాదు అమ్మమ్మా! నువ్వు మిషను మీద కూడా కుట్టవచ్చని చెపితే వినవేం? చేతి కుట్టు ఎలాగా చేస్తావు చక్కగా’’ అంటూ తను మిషను మీద కూర్చుని ఒక చీర విప్పింది. బారడేసి చిరుగులు నాలుగు కనపడ్డాయి! ‘‘అయ్యయ్యో అమ్మమ్మా, ఇంతంత చిరుగుల్తో కట్టుకుంటున్నావా? జోటి చీరలన్నీ వరసగా చిరిగే దాకా చెప్పకుండా వూరుకున్నావా? ఇవన్నీ ఆర్నెల్ల కిందే చిరిగి పోయి వుంటాయి కదా?’’ అంటూనే కంటికి కనపడ్డ చిరుగుని కుట్టెయ్యడం మొదలు పెట్టేసింది మనవరాలు. ‘‘అమ్మమ్మా! ఆ స్వాములాణ్ణి కొంచెం మంచి వాడన్నావు మొన్న. వాడు చూడు, మూర్ఖుడు.’’