‘‘ఏంది మామా ఇది? నీ పద్ధతేం బాగాలేదు! ఎప్పుడూ లేంది ఈ తాగుడేంది? ఈ తిరుగుడేంది? మనిషివి ఎట్టా అయిపోయావో ఒకసారి అద్దంలో చూసుకో’’ అన్నం గిన్నె పొయ్యి మీద నుండి దించుతూ ఆవేదనగా అంది సుబ్బులు.భర్త వైపు నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో, ‘‘అసలేమైందో.. ఎంత కొట్టు కున్నా ఈ మట్టిబుర్రకి అర్థమై చావడం లేదు. ఉన్నట్టుండి ఎందుకు ఇట్టా తయారయ్యావో తెలియడమే లేదు’’ విసుక్కుంటా వచ్చి కోటేశు ఎదురుగా నిలబడింది.
ఉలుకూ పలుకూ లేకుండా శూన్యంలోకి చూస్తూ కూర్చున్న కోటేశుని చూస్తుంటే సుబ్బులుకు ఎక్కడలేని దిగులు ముంచుకొచ్చింది.‘‘నా పాటికి నేను వసపిట్టలా వాగుతూనే ఉన్నాను. నీ పాటికి నువ్వు మాట్లాడకుండా కూర్చున్నావు. పిల్లల్ని కూడా పట్టించుకోవడం లేదు. ఇంక నావల్ల కాదు. విసుగు పుట్టి పోయింది. ఏదేమైనా ఇయ్యాల అటో ఇటో తేలి పోవాల్సిందే’’ జగడం పెట్టుకొనైనా విషయం రాబట్టాలనే పట్టుదల కనిపించిందిసుబ్బులులో.అయినా అతనిలో చలనం లేదు.‘‘ఏందయ్యా.. నా మానాన నేను వాగుతూనే ఉన్నాను ఊ.... లేదు. ఉప్పురాయి లేదు? ఇదిగో.... నాబాష నీకు అర్థమవుతుందా? ఎన్ని రోజులు ఇట్టా నీలో నువ్వు మదన పడతావు? ఏంది... నిన్నే! అబ్బే.. ఈ లోకంలోనే లేవు!’’ పట్టుకుని ఊపుతూ అడిగింది.
ఆమె వైపు అయోమయంగా చూశాడు కోటేశు. ‘‘గోడకు చెప్పినట్టు ఉందేగానీ, మణిసితో మాట్టాడినట్టు లేదు. కూడు పెట్టాను తినమంటే తినవు. మణుసులో మాట మాట్టాడవు. ఏందంట నీ పెంకితనం’’ సుబ్బులు మాట్లాడుతూనే ఉంది.కోటేశు ఉలక్కుండా పలక్కుండా మంచం మీద మూగి మొద్దులాగా కూర్చునే ఉన్నాడు. పిల్లలకు అన్నం పెట్టి వచ్చి మంచం మీద అతని పక్కనే కూర్చుంది సుబ్బులు.‘‘ఏందయ్యా ఏం జరిగింది చెప్పవే! ఎంతకాలం ఇట్టా పిచ్చోడిలా తిరుగుతావు’’ ప్రేమగా అడిగింది సుబ్బులు. అయినా కోటేశు మాట్లాడలేదు. సుబ్బులు పైకి లేచి గడ్డం పైకెత్తి ‘‘చెప్పు మామా... ఎట్టా ఉండేవాడివి, ఎట్టా అయిపోయావు చూడు’’ పైట కొంగుతో ముఖం తుడవబోయింది.ఆమె చేతిని విదిలించి కొట్టి, పైకి లేచి విసురుగా బయటకు కదిలాడు కోటేశు. అంతే వేగంగా సుబ్బులు కూడా పైకి లేచింది.