అనగనగనగా వీరాస్వామి అనే రైతు ఉండేవాడు. అతనికి ముగ్గురు కొడుకులు. మూడో కొడుకు పేరు బంగార్రాజు.టైటిల్స్‌ లోనే ఉత్కంఠ రేపుతోంది కదూ కథ? మిగిలిన ఇద్దరు కొడుకుల పేర్లు ఏంటనేగా? పెద్దోడు వ్యవసాయం చేస్తాడు కనుక కర్షక్‌ అనీ, రెండో వాడు చిన్న తరహా పరిశ్రమ నడుపుతాడు కనుక శ్రామిక్‌ అనీ అనుకుందాం. అంతకన్నా వాళ్ళకి ప్రాముఖ్యత లేదు మరి.బాల్యం నుండీ పెద్దోడు వీరాస్వామి వెంట పొలానికెళిపోయేవాడు. అంతా వాళ్ళ నాన్న పోలిక అనేవాళ్ళు. రెండో వాడు ఎప్పుడూ సైకిలో, ఫ్యానో, మరోటో రిపేరీ చేస్తుండేవాడు. నా కొడుకు పేద్ద వింజినీరు అయిపోతాడు అని మురిసిపోయేది వాళ్ళమ్మ. బంగార్రాజు మాత్రం పొలానికీ వెళ్ళక, బడీ ఎగ్గొట్టి రికామీగా తిరిగేవాడు. వీడేమైపోతాడో, ఎలా బతుకుతాడో.. అని బాధ పడేవాడువీరాస్వామి.ఎవరేమైపోయారో చూద్దామా!

*********************

 ‘‘ఏరా పురుగు మందు సరిగా పనిసేస్తన్నట్టు లేదు’’ పొలం గట్టు మీద నడుస్తూ అన్నాడు కర్షక్‌.‘‘ఎందుకు పనిచెయ్యదు బావా. మొన్న ఇది తాగే కదా తూరుపు ఈది రామ్మూర్తి పోయేడు’’ రాంరెడ్డి.‘‘ఎహె ఊర్కో హాస్సానిక్కూడా హద్దుండాల.’’‘‘మన బతుకే హాస్సెం బావా. పోయిన సంవత్సరం నకిలీ ఇత్తనాల బారినపడ్డోళ్ళల్లో ఆడొకడు. పురుగు మందు నకిలీదైనా బతికిపోయేవోడు.’’ఆకాశంకేసి చూశాడు. మబ్బేమైనా పట్టినట్టున్నాదా? తనలో తనే అనుకోబోయి పైకి అనేశాడు. ఊరుకో బావా అన్నీ అనుమానాలు అన్నాడు రాంరెడ్డి. నీడని చూసి భయపడే కాలం మరి. రెండేళ్ళనాడు వర్షాలు సరిగ్గా పడలే. పోయిన సంవత్సరం సకాలంలో వర్షాలు పడి పంట చేతికొచ్చాక, పాత బాకీ తీర్చేస్తున్నట్టు అకాల వర్షాలు కురిసి, మిర్చి కళ్ళాల్లో నీళ్ళూ, రైతు కళ్ళల్లో నీళ్ళు అనేపరిస్థితి.ఎరువుల కొట్టు యెంకట్రావ్‌ మోటార్‌ సైకిల్‌ మీద వెళుతూ ఆగాడు.‘‘ఈ సంవత్సరం రేటు ఎలా ఉంటదంట యెంకట్రావ్‌?’’‘‘కర్ణాటక, తమిళనాడులో, పైన మహారాష్ట్రలో కూడా కాపు బాగా కాసేట్టుందంట. ధర పడిపోద్దంటున్నారు. మమ్మల్ని మర్చిపోమాక’’ నువ్వు నాకు ముప్పైరెండు వేలు బాకీ అని గుర్తు చేస్తున్నట్టు పళ్ళన్నీ బయట పెట్టి ఇకిలించాడు. మిర్చి యాపారం కూడా చేస్తాడు. ఎలానూ మిర్చి కళ్ళాల్లోకి రాక మునుపే అక్కడికి చేరుకుంటాడు. ఏ పంట వెయ్యాలి, ఎంత వెయ్యాలి, ఎలా పండించాలి అని చెప్పే నాధుడు లేడు. ఏపుగా ఎదిగిన పైరు అవునన్నట్టు తలూపింది.