మాలినీ నది చిన్నచిన్న అలలతో ప్రశాంతంగా ప్రవహిస్తోంది. మలయమారుతం ఉండుండి మంద్రంగా మెలితిరుగుతూ తరగలుగా వీస్తోంది. నది ఇరువైపుల విస్తరించిన అడవిలో సెలయేళ్ల గలగలలు, కొండచరియల నుండి దూకే జలపాతాల సవ్వడులు మానసోల్లాసం కలిగిస్తున్నాయి. మరోవైపు నెమళ్ల క్రేంకారాలు, చిరుపక్షుల కూజితాలు, జంతువుల వింత అరుపులతో సమైఖ్య జీవికకు ప్రతిరూపంలా ఉంది ఆ వన్యప్రాంతం.

ఇంతలో ...

పరిసరాలు ప్రతిధ్వనించేలా వినిపించింది పసిపాప ఏడుపు! ఉలిక్కిపడిన అడవి, లిప్తపాటు బిత్తరపోయింది. అప్పటివరకు అలలతో, చెట్ల కొమ్మలతో ఆడుకుంటున్న గాలి క్షణకాలం స్తంభించింది. ఆనక, ఆ కేకలు వినిపిస్తున్న దిశగా కదిలింది. రెక్కలు విదిలించిన పక్షులు, కొండ నెత్తముల మీద గెంతుతున్న జంతువులు.. గాలిని అనుసరించాయి.తామరకొలను దరి, పచ్చిక బయల్లో దర్శనమిచ్చింది తడి ఆరని కెంజాయ వర్ణపు పసిముద్ద! ఏడుపు వల్ల క్రమంగా మరింత ఎరుపు రంగులోకి మారుతోంది! ఆ దృశ్యం చూసిన అడవి ప్రాణులన్నీ అవాక్కయ్యాయి! అనుకోని అతిథి ఆగమనానికి అబ్బురపడ్డాయి.

*****************

ఆ గది నిండా ఉత్తేజాన్ని రేకెత్తించే రకరకాల పరిమళాలు. సౌగంధికా పుష్పాల సువాసనలు. గవాక్షాల నుంచి మత్తెక్కించే గాలి. ఇవేవీ మేనక మనసుకు, శరీరానికి పట్టడం లేదు. సుతిమెత్తనైన శయ్యపై బడలికగా, కకావికలమైన హృదయంతో పడుకొనుంది. కల్లోల సాగరమైన మనసును తనకు తానే ఊరడించుకుంటోంది. పరిచారికలు అలంకరణకు కావాల్సిన వజ్ర, వైఢూర్యాలు పొదిగిన బంగారు ఆభరణాలను సిద్ధం చేస్తున్నారు. రత్నాలు తాపడమైన దుస్తులకు మెరుగులద్దుతున్నారు. ఇంద్రుడు సభకు వచ్చే సమయానికల్లా మేనకను తయారు చేయాలి. దేవేంద్రుడు మేనక నృత్యాన్ని కోరకపోయినా ఆమె సిద్ధంగా ఉండాల్సిందే! ఆయన సంతోషానికి, సల్లాపానికి అనుగుణంగా మారిపోవాల్సిందే!తను తప్పు చేసిందా? ఒప్పు చేసిందా? ఎవరికోసం చేసింది? ఎందుకు చేసింది? కనులు కూడా విప్పని పసికందును అడవిలో వదిలేసి వచ్చేసింది. తనలో మానవత్వం చచ్చిపోయిందా? మాతృహృదయం మాయమై పోయిందా! అమ్మతనం మంటకలిసిందా? అసలు ఎందుకు చేయాల్సి వచ్చిందా పని? ఎవరు బలవంతంగా చేయించారు? ఎవరి అధికారం కోసం తన పసిపాపను బలిచేసింది?