ఆ కారులో ఐదుగురున్నారు. మంచు కమ్ముకున్న రహదారిమీద కారు వెళుతోంది. అందులో ఉన్నవాళ్లలో ఇద్దరు భారతీయులు, మిగిలిన ముగ్గురూ ఉగాండాకు చెందినవాళ్లు. కారు నడుపుతున్న వ్యక్తే అందరికన్నా చాలా చిన్నవాడు. మువాంగా పేరు కలిగిన అతనికి పద్దెనిమిదేళ్లు ఉండొచ్చు. కానీ మనిషి చాలా దృఢంగా, ఆరడుగులకన్నా ఎత్తు కలిగి ఉన్నాడు. రాతి శిల్పంలా తీర్చిదిద్దినట్టున్న శరీరం.
అతను కారు నడపుతుంటే ఒక యంత్రం నడుపుతున్నట్టుగానే ఉంది.ఉగాండా తూర్పు ప్రాంతంలో ఉన్న బుసోకా ఉప ప్రాంతంలోని జింజాలో ప్రవహించే నైలు నదికేసి సాగుతున్నది వాళ్ల ప్రయాణం.కంపాలా నుండి వాళ్లు రోడ్డుమార్గం గుండా ప్రయాణిస్తున్నారు. కారులో ఉన్న భారతీయులిద్దరూ వయస్సు పైబడ్డవాళ్లు. వాళ్లు ఉగాండాలో నివాసమేర్పరచుకుని ముప్పై ఏళ్లకు పైగానే కావస్తున్నది.నరేష్ గిద్వానీకి ఏడుపదులు దాటాయి. ఆయన తలపై తెల్లటి ఖద్దరు కుళ్లాయి పెట్టుకున్నాడు. అదే రంగులోని ఖద్దరు జుబ్బా, పైజమా! విశామైన నుదురు. తలంతా నెరిసినప్పటికీ పెద్దగా రాలిపోలేదు. ఆయన ముఖానికి తగ్గట్టుగా పెద్ద కళ్లద్దాలు ధరించాడు. ఆయనతో ఉన్న శుక్లాకు అరవై ఏళ్లుండొచ్చు. మనిషి పొట్టిగా ఉన్నాడు. నల్లని పెదాలు.
బాన కడుపు. పొడవైన ముక్కు. ఆయన కూడా ఖద్దరు బట్టలే ధరించాడు.ఆయన ఒడిలో ఒక చెక్కపెట్టె ఉంది. దాన్ని ఎంతో జాగ్రత్తగా, బాధ్యతగా పట్టుకొని ఉన్నాడు.శుక్లా, గిద్వానీ లిద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. తమకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా పూర్తిచెయ్యాలన్న ఆలోచన కలిగినవాళ్లలాగా కారులో కూర్చొని ఉన్నారు. కారు మితమైన వేగంతోటే వెళుతున్నది.ఇంపీరియల్ బ్రిటీష్ ఒప్పందదారుడు అలీబాయ్ ముల్లా జివాంజి సాయంతో 19వ శతాబ్దపు ద్వితీయార్థంలో ఉగాండాకు సిక్కులను కూలీగా తీసుకురావటం జరిగింది. ఉగాండా రైల్వేను మొంబసా నుండి కిసుము వరకూ 1901 వ సంవత్సరంలోనూ, 1931 వ ఏడాది మధ్యలో కంపాలాలోనూ వాళ్లు ఏర్పరిచారు. ఆ కఠినమైన రైల్వేలైను వేసే పనిలో భారతీయులెందరో మరణించారు. కొందరు చేతులూ కాళ్లూ పోగొట్టుకున్నారు.