లాక్‌ డౌన్‌ తర్వాత వచ్చిన తొలి ఆదివారం అది. బైపాస్‌కు ఆనుకుని ఉన్న పెట్రోల్‌ బంకు పక్కన పంక్చర్‌ షాపులో కూర్చుని ఉన్నాడు రిజ్వాన్‌. అతనికెందుకో ఇవ్వాళ ఆ ‘కారుమనిషి’ గుర్తుకొస్తున్నాడు.అతనెవరో రిజ్వాన్‌కు తెలియదు. ప్రతి ఆదివారం సాయంత్రం నేరుగా కారులో తన పంక్చర్‌ షాపును వెతుక్కుంటూ వస్తాడు. కారును పక్కనే పార్క్‌ చేసి షాపులో కూర్చుంటాడు. వన్‌ బై టూ టీ చెప్పి, ఒక సిగరెట్‌ వెలిగించి పిచ్చాపాటి మాట్లాడి వెళ్లిపోతాడు.

మొదట రిజ్వాన్‌ కొంత గందరగోళపడ్డాడు. తర్వాత అలవాటు పడ్డాడు. రిజ్వాన్‌ ఒక్కోసారి అతనితో బాగా మాట్లాడుతాడు. తనబాధలన్నీ చెప్పుకుంటాడు. అతను చెప్పిందీ వింటాడు.అతను ఎక్కువగా ఇంగ్లిషు మాటలు కలిపి మాట్లాడుతాడు. ఇంటర్‌ దాక చదువుకున్న రిజ్వాన్‌కు అతని భాషంతా అర్థమవుతుంది కానీ అది ఆఫీసర్ల భాష అనిపిస్తుంది. ఒకసారి అడిగాడు కూడా ‘మీరు ఎంప్లాయా.. సార్‌?’ అని.‘అవును’ అన్నాడతను.‘ఎక్కడ చేస్తారు? ఏం చేస్తారు?’ అని అడుగుదామనుకున్నాడు కానీ అదంతా తనకు అనవసరమనిపించింది. అసలే పెద్దింటోడిలా ఉన్నాడు. ఏ మాటకు ఏం అపార్థం చేసుకుని నెత్తిమీదికొస్తుందో అని కొంత భయపడ్డాడు కూడా.రోజులు ప్రశాంతంగా గడిచేకొద్ది అతనెప్పుడూ ఇలా గుర్తుకురాలేదు. బహుశా కరోనా వల్ల గిరాకీల్లేక ఏమీ పాలుపోక పోవడమే ఇందుకు కారణం కావొచ్చు.అతనొస్తే కలసి వన్‌ బై టూ టీ తాగి పిచ్చాపాటి మాట్లాడుకుంటే కొంత హాయిగా ఉంటుందనిపిస్తోంది రిజ్వాన్‌కి. అందుకే షాపు ముందు నుంచి ఏ కారు వెళ్లినా డ్రైవర్‌ సీట్లో అతనే ఉన్నాడేమో అని చూస్తున్నాడు. ఎక్కువ సార్లు అతనే కారు డ్రైవ్‌ చేసుకుంటూవస్తాడు. ఎప్పుడో కానీ పక్కన డ్రైవర్‌ ఉండడు. అతనేం పని చేస్తాడో తెలుసుకోవాలని రిజ్వాన్‌కు ఆశ.అతనిది క్రెటా, హ్యూందాయ్‌ కంపెనీ కారు. ఎప్పుడూ ఖరీదైన టీ షర్టు, నైట్‌ ప్యాంటు వేసుకుని కనబడతాడు. మధ్య వయసు. రోజు గీకే చదునైన గడ్డం. సిగరెట్ల వల్ల బేస్‌ గొంతు. మంచి పొడుగు, సన్నం, త్రీపీస్‌ కళ్లద్దాలు. రంగు కొంత నలుపైనా ఎప్పుడూ ఏసీ గాలితో తాజాగా అనిపించే చర్మం. మనిషి దర్పంగా కనిపిస్తాడు.