పొగమంచులాగ కమ్ముకున్న పచ్చదనంలో కలసిపోయిన ఆ ఫ్యాక్టరీ క్వార్టర్సు ఆవరణలో అప్పుడప్పుడే సందడి మొదలవుతోంది. రంగు రంగుల పిట్టలు ఇళ్లముంగిట సందడి చేస్తున్నాయి. పుస్తకాల సంచుల్లేకుండా పిల్లలు నవ్వుతూ, పూలమొక్కలమధ్య ఆడుతూ స్కూలుకి పరుగెడుతున్నారు. పండక్కివచ్చి వెళ్తున్న బంధువులకు ఒక యింటి గేటుదగ్గర బెంగగా వీడ్కోలు పలుకుతున్నారు.
ఆ ఉదయం తొమ్మిదిగంటలవేళ దుర్గాపురం మైనింగ్ కంపెనీ సంక్షేమ అధికారి సింహాద్రి అందర్నీ పలకరిస్తూ సైకిల్ మీద ఆఫీసుకు వెళ్లాడు.సింహాద్రి ఆఫీసులోకెళ్లేసరికి కొత్తగా ఉద్యోగంలో చేరిన గిరి వచ్చివున్నాడు.‘‘నిన్న ఆదివారం యెలాగడిచింది?’’ అడిగాడు సింహాద్రి.‘‘యీ క్వార్టర్సు దుర్గాపురం కొండలమధ్య అడవిలోవున్నా యిక్కడ కొన్నిటికి యేలోటూ లేదు. నన్ను ఆప్యాయంగా భోజనానికి పిలిచిన వాళ్ల లిస్టునుబట్టి యింకోనెలవరకు క్యాంటీన్ మొహం చూడక్కరలేదు. కాలక్షేపానికి నిన్నటి తోలుబొమ్మలాట బావుంది, యిదే మొదటిసారి చూడ్డం. ఫిల్మ్‌క్లబ్ వుందిగాని అక్కడ అవార్డు సినిమాలే వేస్తున్నారు. ఉన్న నాలుగుషాపుల్లో లేటెస్టు వస్తువులేవీ దొరకలేదు’’ తన అనుభవాలు చెప్పుకున్నాడు గిరి.‘‘పద, మీటింగుహాల్లో రేపటి సమావేశానికి యేర్పాట్లు చేయాలి, ఆలస్యమవుతోంది’’ అని బయటకు నడిచాడు సింహాద్రి.‘‘రెండురోజుల్నించి మీకొచ్చే ఫోన్లను చూస్తూంటే మీటింగేదో ముఖ్యమైందే అనిపిస్తోంది.’’‘‘మనకో చిక్కుసమస్య రాబోతోంది. మన కంపెనీలో ఉత్పత్తి పెంచాల్సిన అవసరం వచ్చింది.
మన ఉద్యోగులతోనే ‘ఓవర్ టైం’ చేయిస్తే సరిపోతుందని కంపెని సీయెండీ రాంప్రకాషుగారు అనుకుంటున్నారు. ఉద్యోగసంఘాల నాయకులతో స్వయంగా మాట్లాడ్డానికి ఆయన రేపు యిక్కడికొస్తున్నారు. మొన్న నాకు ఫోన్ చేసి ఆ మీటింగు యేర్పాటు చేయమన్నారు.’’‘‘హఠాత్తుగా ఉత్పత్తి పెంచాల్సిన అవసరమేమొచ్చింది?’’‘‘రాబోయే మూడునాలుగు సంవత్సరాల్లో మనఫ్యాక్టరీలో ఉత్పత్తయ్యే ఖనిజానికి దేశవిదేశాల్లో డిమాండు విపరీతంగా పెరుగుతుందని మొన్నటి ఆలిండియా మైనింగ్ కంపెనీల సమాఖ్య ముంబాయి సమావేశంలో చెప్పింది. మనకంపెనీ ఉత్పత్తిని పెంచుకోవాలని, దాని ఎగుమతికి అన్నివిధాలా సహాయపడతామని, యీ అవకాశాన్ని పోగొట్టుకోవద్దని సమాఖ్య గట్టిగాసూచించింది.’’‘‘యిది వుద్యోగులక్కూడా లాభమేగా. యిందులో చిక్కుసమస్య యేముంది?’’‘‘నాకుతెలిసీ ఓవర్ టైముకు మనవాళ్లు వొప్పుకోరు’’ అన్నాడు సింహాద్రి.క్వార్టర్సు ఆవరణంతా మనుషులు తిరుగుతున్నా, మాట్లాడుకుంటున్నా అంతా ప్రశాంతంగా ఉంది. సందడిలేని ఆసుపత్రి భవనానికి, కూరగాయల సేంద్రియ పొలానికి మధ్యదారిలో నడుస్తున్నారు.