ఆడపిల్లకు పదేళ్ళ వయసు నుంచే మగవాళ్ళ నుంచి వేధింపులు మొదలవుతున్నాయి. ఈ వేధింపులను, వారి బెదిరింపులను ఎలా ఎదుర్కోవాలో తల్లిదండ్రులకు కూడా అర్థం కావడం లేదు. ఏదో ఒక దొంగసాక్ష్యం ఆడ్డం పెట్టుకుని తమ కోరిక తీర్చమంటూ ఆడపిల్లల్ని బ్లాక్‌ మెయిల్‌ చేయడం ఎక్కువైపోయింది. ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఆడపిల్ల కుటుంబం నిస్సహాయస్థితిలో పడిపోతోంది. ఈ కథలో కూడా ఏం జరిగిందంటే......

 

బెంగళూరు మహానగరం.అల్సూరులో ఫ్రాంక్‌ ఆంథోనీ స్కూల్‌ ఎదురుగా చిన్నగల్లీ.అలసటను లెక్కచేయకుండా ఆ గల్లీలో చిరుచీకటిచాటున అరగంటనుంచీ కదలకుండా మెదలకుండా అలాగే నిలబడి ఉన్నాడు భాస్కర్‌. దాహంతో అతడి నాలుక పిడచకట్టుకుపోతోంది. దానికితోడు అలసట.పక్కనే జ్యూస్‌ సెంటర్‌. అక్కడికివెళ్ళి చల్లటిపానీయం తాగొచ్చు, దాహం తీరుతుంది. అయినా, అలాంటి ప్రయత్నం చేయడంలేదు. కదలకుండా అక్కడేనిలబడి, ఒక క్యాబ్‌కోసం ఎదురుచూస్తున్నాడు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు.

 

చివరకి ఏడున్నర అవుతున్నప్పుడు, క్యాబ్‌ వచ్చి రోడ్డుపక్కగా ఆగింది. భాస్కర్‌ కూతురు శైలజ, ఆమె సహోద్యోగి సుధీర్‌ క్యాబ్‌లోంచి దిగారు.సుధీర్‌కి బై చెప్పి ఇంటివైపు నడిచింది శైలజ. పైకి నవ్వుతూ మర్యాద నటిస్తోందిగానీ, తనలాగానే తన కూతురు శైలజకు కూడా సుధీర్‌ని ముక్కలు ముక్కలుగా నరికేయాలన్నంత కసి ఉందని భాస్కర్‌కి తెలుసు.సుధీర్‌ ఈలవేసుకుంటూ నడుస్తుంటే అతన్ని చాటుగా వెంబడించాడు భాస్కర్‌. ‘శైలజ జీవితాన్ని అతలాకుతలం చేయాలనుకుంటున్న ఈ దుర్మార్గుడి విషపన్నాగంనుంచి బయటపడే మార్గం ఉందా’ అనే ప్రశ్న భాస్కర్‌ని కలచివేస్తున్నది.కొన్ని సంవత్సరాలక్రితం కూడా భాస్కర్‌, శైలజలకి ఇలాంటి పరిస్థితేఎదురైంది. అప్పుడు ఏదోఒకలాగా ఆ ప్రమాదానికి దూరంగా తప్పుకున్నారు. కానీ ఇప్పుడు అలా తప్పించుకోవటం సాధ్యమవుతుందా అని నిస్పృహగా అనుకున్నాడు భాస్కర్‌.శైలజకి పన్నెండేళ్ళ వయసులోనే భాస్కర్‌ భార్య రోడ్డుప్రమాదంలో మరణించింది. శైలజకి తల్లిలేనిలోటు తెలియకుండా పెంచటానికి భాస్కర్‌ శ్రమపడ్డాడు. ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగంవల్ల మూడునాలుగేళ్ళకి ఒకసారి అతడికి బదిలీ అయ్యేది. అలా శైలజ ఇంటర్‌ చదివేసమయానికి హైదరాబాద్‌ వచ్చారు.స్నేహితురాలు కల్పన ఇంట్లో శైలజ కొన్నాళ్ళు కంబైన్డ్‌ స్టడీస్‌ చేసినప్పుడు, ఆ పక్కింట్లో రాకేశ్‌, శైలజ వెంట పడటం మొదలుపెట్టాడు.