తొలకరి జల్లులు పడి నేల చిత్తడి చిత్తడిగా తయారైంది. వానతోపాటు వచ్చిన చిరుగాలికి పారిజాతం పువ్వులు నేలమీద తివాచీ పరిచాయి. అరుగుమీద పడక కుర్చీలో కూర్చున్న రాఘవకి వాటిని చూడగానే సాకేత్ గుర్తుకొచ్చాడు. చిన్నప్పుడు తన చిట్టి చిట్టి చేతులతో ఏరి చిన్నికృష్ణుడి విగ్రహం ముందు పోసేవాడు. బుద్ధిగా చేతులు కట్టుకొని, ‘చేతవెన్నముద్ద చెంగల్వ పూదండ’ అని ముద్దు ముద్దుగా పద్యం చదివేవాడు. వాడి చిన్నతనం కళ్ళకి కట్టినట్టు, ఈ మధ్యే జరిగినట్టుగానే అనిపిస్తోంది. అప్పుడే వాడు పెద్దవాడు అయిపోయాడా! లేక, తనకి ముసలితనం ముందే వచ్చేసిందా!
‘‘ఏం చేస్తున్నారిక్కడ! అబ్బాయి లైన్లో ఉన్నాడు’’ సునంద. సాకేత్ ఫోన్ అనగానే గబగబ ఇంట్లోకి వెళ్ళాడు. ఫోన్ చెవులకి గట్టిగా అదిమి పెట్టి, ‘‘హలో! ఎలా ఉన్నావు నాన్న!’’‘‘బాగానే వున్నాను! మీరెలా ఉన్నారు నాన్నా! అమ్మ చెప్తోంది బెంగ పెట్టుకున్నారని!’’‘‘అబ్బే! అదేం లేదురా! ఏదో పరధ్యానం అంతే! నువ్వు జాగ్రత్త! ఇంకా ఏంటి సంగతులు?’’‘‘ఏముంటాయి నాన్న! వచ్చి కొన్ని రోజులే కదా.. ఇప్పుడిప్పుడే ఎడ్జస్ట్ అవుతున్నాను. మీరిద్దరూ జాగ్రత్త’’ ఫోన్ పెట్టేశాడు.‘‘అయ్యిందా ఫోన్? ఏముంటాయి రోజూ సంగతులు? ఒక్కరోజు ఫోన్ రాకపోతే కంగారు పడిపోతారు! రోజు రోజుకి చంటిపిల్లాడైపోతున్నారు. వాణ్ణి కాస్త స్థిమితంగా ఉండనీయండి. అమెరికా మొన్ననేగా వెళ్ళాడు, చదువు బిజీ కదా!’’‘‘సర్లే! నాకు తెలుసులే’’ అని తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు.
అల్మారాలో ఉన్న కార్వాన్ రేడియో ఆన్ చేశాడు. కార్వాన్ రేడియోలో రాఘవకి ఇష్టమైన హిందీ పాత పాట ‘‘దిల్ కహే రూక్ జా రే రూక్ జాయహీ పె కహీ జో బాత్ ఇస్ జగహె మె, హై కహీ పె నహీ’’ వింటూ మైమరిచిపోయాడు.‘‘భోజనానికి రండి’’ రాఘవ గది తలుపు తట్టింది సునంద. డైనింగ్ టేబుల్ మీద కంచంలో గోంగూర పులుసు ఘుమఘుమలు ఆస్వాదిస్తూ హఠాత్తుగా ఆగిపోయాడు.‘‘సాకేత్కి ఈ పులుసంటే ఎంతిష్టమో? నువ్వు నెయ్యివేసి కలిపి పెడితే కడుపునిండా ఈ ఒక్క ఐటెమ్ రెండుసార్లు తినేవాడు’’ గొంతు జీరబోయి, దగ్గు వచ్చింది. సునంద మంచినీళ్ళిచ్చి తలమీద