‘‘రెండ్రోజుల్లో పంపిస్తాను.’’యథాలాపంగా మెసేజ్‌ టైప్‌ చేసి తలెత్తిచూశాను. పుస్తకాల షాపులో జనం బాగా ఎక్కువగానే ఉన్నారు. ఈ వారం రోజులూ చాలా పని ఒత్తిడితో గడిపాను. అందుకే వారాంతంలో పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలనుకున్నాను. కానీ ప్రకాశ్‌ నుంచి మెసేజ్‌, ‘వ్యాసం ఎప్పుడు పంపుతారుసార్‌?’ అంటూ. రెండు మూడు వారాల క్రితం ఏవో కబుర్ల మధ్యలో అన్నాను అతనితో ‘రాముడిని ఎలా అర్థం చేసుకోవాలి?’ అనే శీర్షికతో ఒక వ్యాసం రాద్దామనుకుంటున్నా’నని. 

రాముడి స్వభావాన్నీ మనస్తత్వాన్నీ బలహీనతలనీ విశ్లేషిస్తూ రాయాలనుకున్న వ్యాసం అది.‘‘మా పత్రికకే పంపుతున్నారుగా!’’ అన్నాడతను నా మాట పూర్తి కాక ముందే.నవ్వుతూ తల ఊపాను.అప్పటి నుంచి రెండు మూడుసార్లు గుర్తుచేశాడు. ఏమిటో తాత్సారం చేస్తున్నాను కానీ నిజానికి ఆ వ్యాసం రాయడం పెద్ద పని కాదు. ఎలా మొదలు పెట్టాలి, ఏం రాయాలి, ఎలా ముగించాలి - మొత్తమంతా మనసులో సిద్ధంగానే ఉంది. కాయితం మీద పెట్టాలంతే.అందుకే పెద్దగా ఆలోచించకుండా ‘రెండ్రోజులు’ అని మెసేజ్‌ పంపేశాను. అలా ఒక టైమ్‌ పెట్టుకుని, దానికి కట్టుబడితే తప్ప పనులు తెమలవు.ఆలోచిస్తూనే కొత్తగా వచ్చిన పుస్తకాలు తిరగేస్తున్న నేను కొంచెం దూరంలో షాపు బయట మెరుపులా కనబడి మాయమయిన అమ్మాయిని చూసి ఉలిక్కిపడ్డాను ... జానకి!జానకి ఎలా వచ్చిందిక్కడికి! అనుకుంటూ గబగబా అటు అడుగులు వేశాను.జానకి నా చెల్లెలు, పిన్ని కూతురు. కానీ అంతకన్నా మించి మంచి స్నేహితురాలు. వయసులో ఒక్క నెలే తేడా మాకు. చిన్నప్పుడు ఇద్దరం ఒకే స్కూలు, ఒకే క్లాసు. ఎప్పుడు చూసినా ఒకళ్ళనొకళ్ళం వదిలి పెట్టకుండా జంటగా తిరిగేవాళ్ళం.వేగంగా షాపు బయటికివెళ్ళాను కానీ తను ఎటు వెళ్ళిపోయిందో కనబడలేదు. నలుగుర యిదుగురు అమ్మాయిల మధ్యలో నుంచి ఒకే ఒక్కక్షణం మొహం మాత్రమే కనబడింది. చీరా, చీర రంగూ వంటివి కూడా గమనించ లేదు. మాల్‌లో షాపులన్నీ చాలా సందడిగా ఉన్నాయి. కాసేపు అటూ ఇటూ పరికించి చూసి చిన్నగా నిట్టూర్చి మళ్ళీ వెనక్కి వచ్చాను. నాకు కావలసిన పుస్తకం కొనుక్కుని షాపులో నుంచి బయటికి వచ్చాను. కళ్ళు వెతుకుతూనే ఉన్నాయి.