‘నీ జవాబు కోసం చకోరిలా ఎదురు చూస్తున్నాను’సుధాకర్ పంపిన మెసేజ్ చూసింది వర్ష. చిన్నగా నిట్టూర్చి వూరుకుంది.కాలేజీకి బయల్దేరింది. సగం దూరం వెళ్ళకుండానే మరో మెసేజ్. మళ్ళీ అతడి నుంచే. ‘ప్లీజ్. జవాబియ్యి’. పెదవి కొరుక్కుంది.
మరి కాసేపటికి, ‘టెన్షన్ భరించలేక పోతున్నా. జవాబియ్యి వర్షా’ అనింకో మెసేజ్ వచ్చింది. అది చూసి కించిత్తు కలవర పడింది. అంతలోనే సర్దుకుని భుజాలు ఎగరేసి కాలేజీలో కెళ్ళిపోయింది.‘‘హాయ్ వర్షా. నీ హీరో ఎక్కడా కన్పించడేం?’’ చుట్టూ వెతికి అడిగింది ఆమని.‘‘తెలీదు’’ఇంతింత కళ్ళతో చూసింది. ఆపైన గుంభనంగా నవ్వింది. ‘‘బ్రేకప్పా?’’‘‘అలాంటిదేం లేదు.’’‘‘అయితే ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు?’’‘‘తెలీదు.’’ఆమె చూపుల ప్రశ్నలు పట్టించుకోకుండా వెళ్ళి తన సీట్లో కూర్చుంది. లెక్చరర్ ఏదేదో చెబుతున్నారు. వర్ష బుర్రలోకి ఒక్క ముక్కా ఎక్కటం లేదు.రెండేళ్ళ క్రితం డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరినప్పుడే సుధాకర్‌ని ప్రథమంగా చూసింది. అతడు క్రికెట్ బాగా ఆడటం చూసి అభినందించింది. అలా మొదలైన పరిచయం విస్తరించి స్నేహంగా ఆపైన ప్రేమగా రూపాంతరం చెందింది.
ఎన్ని కబుర్లు కలబోసుకున్నారో, చెట్టపట్టాలేసుకుని ఎన్నెన్ని చోట్ల తిరిగారో, ఒకరితో ఒకరు ఎంత ఇష్టంగా మసిలారో వర్ణించడానికి రోజులూ చాలవు.రెండ్రోజుల క్రితం, ‘‘మనం లేచిపోయి పెళ్లి చేసుకుందాం’’ అని ప్రతిపాదించాడు. ఆ మాట విన్నప్పట్నుంచీ ఆమె మనసు కల్లోల సముద్రంగా మారిపోయింది. రూపం లేని భయాలు చుట్టుముట్టగా అతడ్నితప్పించుకుని తిరుగుతోంది. అతడు మెసేజ్‌లతో సెల్‌ని నింపేస్తున్నా స్పందించడం లేదు!గాఢంగా నిట్టూర్చింది వర్ష.‘ఏవైంది?’ నోట్‌బుక్‌లో రాసి అడిగింది పక్కనే కూర్చున్న భాగ్యలక్ష్మి.‘అంతా అయోమయంగా ఉంది’ అని దాని కింద రాసింది వర్ష.బెల్ మోగటం ఆలస్యం, ‘‘హెడేక్‌గా ఉంది. ఇంటికెళ్తాను’’ అని చెప్పి కాలేజీలోంచి బయట పడింది. గేటు దాటుతోంటే ఆమె కోసమే ఎదురు చూస్తున్న సుధాకర్ ఎదురొచ్చాడు.‘‘నాకు జవాబు కావాలి.’’‘‘ఏమని ఇవ్వాలో తోచటం లేదు.’’‘‘నన్ను ప్రేమిస్తున్నావా లేదా?’’‘‘సందేహిస్తున్నావా?’’‘‘పెళ్లి చేసుకుందామా వద్దా?’’జవాబుగా ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్ళు ఉబికాయి.‘‘ప్లీజ్ ఏడవ్వొద్దు. అంతా చూస్తున్నారు. దూరంగా వెళ్ళి కూర్చుందాం పద.’’