‘‘అబ్బ! ఈ హైదరాబాద్‌ ట్రాఫిక్‌తో వేగలేకపోతున్నాం. యెంత ముందు బయలుదేరినా మళ్ళీ అదే టైమవుతోంది’’ విసుక్కుంది రుక్మిణి కారులోంచి బయటకు చూస్తూ.జూన్‌ నెలలో అప్పుడే వర్షాలు మొదలై నాయి. రుక్మిణి, చక్రపాణి సచివాలయంలోని తమ ఆఫీసు నుంచి యల్‌.బి నగర్‌లో వున్న స్వగృహానికి బయలుదేరారు.సాయంత్రం ఐదున్నర.‘‘నువ్విప్పుడు అర్జెంటుగా యింటికెళ్ళి చేసేదేముంది? అంత విసుగు దేనికీ? హాయిగా కారులోంచి కురుస్తున్న వాననూ, నిలిచి పోయిన వెహికల్స్‌నూ చూసి ఆనందించక?’’ డ్రైవింగ్‌ సీట్లోనే వెనక్కి వాలి బయటకు చూస్తూ అన్నాడు చక్రపాణి.‘‘అబ్బ! ఈ రోజు శుక్రవారమండి.

 తొందరగా వెళితే యిల్లు, వాకిలి వూడ్చేసి, స్నానం చేసి దీపం పెట్టుకోవచ్చని - అందుకే హడావిడిగా బయలుదేరాను.’’‘‘ఆ పన్లేవో అబ్బుచుక్కులుకి చెప్పలేకపోయావా?’’‘‘సర్లెండి! మీ కూతురూ, మీరూ చాలా పని మంతులు. దాన్ని నమ్ముకుంటే అయినట్లే! యెంత టైమూ సెల్‌ ఫోన్‌కే సరిపోదు యిక యింటిపన్లేం చేస్తుంది?’’ రుక్మిణి అంటుండగానే యిల్లు చేరారు.చక్రపాణి కారు పార్క్‌ చేస్తుండగా రుక్మిణి దిగి యింట్లోకి నడిచింది. గేటు ముందరా, గేటులోపలా, కురిసిన వర్షానికి గేటునానుకొని వున్న చెట్టు ఆకులూ, చిన్న, చిన్న కొమ్మలూ పడి అంతా చిందరవందరగా వుంది. చూస్తూనే వుసూరుమనిపించింది. పొద్దునంతా శుభ్రంగా కడిగించింది. మళ్ళీ చెత్త చెత్తయింది.ముందుగా చెప్పులు విప్పి బ్యాగ్‌ బయట పెట్టి కొబ్బరి చీపురు తీసుకొని వాకిలి వూడవటం మొదలు పెట్టింది. చిన్న, చిన్న ఆకులవడంతో నీళ్ళలో తడిసి కదలట్లేదు. బలమంతా వుపయోగించి ఎలాగోలా వాకిలి వూడ్చి కాళ్ళు కడుక్కొని లోపలికొచ్చింది.‘‘ఇల్లు మిత్ర వూడ్చింది. వాకిలి కూడా వూడవవే అంటే వింటేనా? చెవుల్లో అవేవో పెట్టుకొని డాన్సు చేయటమేనాయే’’ అంది రాధమ్మ - రుక్మిణి అత్తగారు.‘‘ఈ చెత్త చెట్టు వొకటీ యెప్పుడూ, ఆకులూ, కాయలూ యింటినిండా రాలడమే! వూడ్చీ, వూడ్చీ చేతులు నొప్పిపుడుతున్నాయి. వర్షం పడితే మరీ ఘోరం.. చస్తున్నాం’’ చిరాగ్గా అంది రుక్మిణి.‘‘పందొమ్మిదీ, యిరవై యేండ్ల పిల్ల ఇంట్లో వుంటే తల్లికి యెంత ఆసరా వుండాలి? దేనికీ ఆశ లేదాయే.. వస్తూనే చీపురు పట్టుకోవాల్సిందేగా? దానికి పని చెప్పక చెడగొడుతున్నావ్‌ రుక్కూ’’ అంది రాధమ్మ.