తానో మగవాడ్ని చూడ్డానికి బయల్దేరాననే నిజాన్ని పెద్దగా అరిచి చెప్పేయాలనిపించింది శశిరేఖకు కారు బయల్దేరబోతూండగా.‘‘యెప్పుడో కొలీగ్‌ అయినంత మాత్రాన యిప్పుడంత దూరం వెళ్ళి చూడాలా?’’ అన్నాడు కొడుకు నొసలు పైన ముడతలు పడుతూండగా ముఖం చిట్లించుకుని చూస్తూ.అతడి నలభై అయిదేళ్ళ ముఖంలో తండ్రి పోలికలు స్పష్టంగా కనబడుతుండగా ‘జీన్సెంత బలంగా దిగిపోయాయి?’ అనుకుంది శశిరేఖ. 

వీడినాన్న బతికుంటే అబద్ధం చెప్పే ధైర్యమైనా తనకుండేదిగాదని ఆమె అనుకుంది. యెప్పుడైనా ఆమె ఏ పరాయి మగాడితో నైనా, చివరకు షాపువాడితో నైనా చనువుగా మాట్లాడినట్టు అనుమానమొస్తే చాలు, అరుణాచలం కోపంతో యెగిరి దూకేవాడు. ఆ సంగతి తెలిశాక జాగ్రత్తగా బతకడమెలాగో ఆమె నెమ్మదిగా నేర్చేసుకుంది.కారు కదలగానే ఆమె చూపుల్ని ముందుకు తిప్పింది. డ్రైవరు ముందున్న రియర్‌ వ్యూ అద్దంలో తన ముఖం కనబడగానే ఆమె వులిక్కిపడింది. అరుణాచలం చనిపోయిన పద్నాలుగు రోజుల తర్వాత, దివసాల తతంగం ముగిసిన మరునాడు, తన ముఖంపైన కుంకుమ బొట్టును చూసి విస్తుపోయిన పెద్ద కొడుకుతో ‘‘మీ నాన్న మాట తీసుకున్నారు, బొట్టు పెట్టుకోడం మానొద్దని’’ అంది శశిరేఖ.

‘నా అబద్ధాల్ని వీడి తండ్రే కనిపెట్టలేక పోయాడు. వీడెంత?’ అనుకోగానే ఆమె సంతృప్తిగా నవ్వుకుంది.కారు తిరుపతి శివార్లు దాటుతూనే స్కూలు బస్సొకటి యెదురొచ్చింది. నలభై రెండేళ్ళ క్రితం తిరుపతి మునిసిపల్‌ స్కూల్‌ టీచరుగా వుద్యోగం వచ్చినప్పుడు, సంసారమనే జైల్లోంచీ కొన్ని గంటల సేపు విడుదల దొరికినప్పుడు, తానూ యీ పిల్లల్లా స్వేచ్ఛగా ప్రాణ వాయువును పీల్చుకుంటూ కేరింతలు గొట్టివుంటుందని ఆమెకు స్ఫురించింది.ప్రాణ వాయువు దేవప్రసాద్‌ రూపంలో దొరుకు తుందని మాత్రం ఆమెకప్పుడు తెలియదు.చామన ఛాయతో, అయిదున్నరడుగుల పొడుగుతో సన్నగా రివటలా వుండే దేవప్రసాద్‌ను ప్రత్యేకంగా గుర్తించే విశేషమేదీ లేదు. స్కూల్లో కొలీగ్‌గా పరిచయమైనప్పుడు ‘గుడ్‌ మార్నింగ్‌’ చెప్పడం తప్ప అతడితో ఆమె యెక్కువగా మాట్లాడిందీ లేదు. ఏపీవోగా వచ్చిన ఎలక్షన్‌ డ్యూటీ అతడితో ఆమెకున్న పరిచయపు స్వరూపాన్నే మార్చిపారేసింది. పరాయి మగాడితో తానో రాత్రంతా వొంటరిగా గడిపానన్న విషయం మొగుడికి తెలిస్తే ఏం జరుగుతుందో వూహించుకోడానికే అప్పుడామె హడలిపోయింది.