నలభై ఏళ్ళపాటు ఓ.టి.లోనికి వెళ్ళిన ప్రతిసారీ సర్జికల్ మాస్క్ వేసుకోగలిగిన ప్రివిలేజ్ తల్చుకుంటే ఇప్పుడంత గర్వంగా లేదు డాక్టర్ చెల్లారావుకి. ఇలా ఏంబులెన్స్‌లో స్ట్రెచర్ మీద పడుకుని గతుకులతో ముక్తాయింపుగా కదులుతూ, పైన ఇనప చూరు తప్ప ఏమీ కనబడని ‘వార్నిష్ పెచ్చులూడిన’ శూన్యంలోకి చూస్తున్నప్పుడు అతని మానసికస్థితి ‘ఇది’ అని చెప్పడానికి వీలు లేకుండా ఉంది.కొట్టుకుంటున్న తన ప్రాణపు దూదిపింజెని కొన ఊపిరి మీద నిలబెట్టిన జీవుడి మీద కోపం, ఎన్నో నొప్పుల్ని ఎనభై మూడేళ్ళుగా భరించిన బ్రతుకు పాటకి చిట్ట చివరి స్వరంలా చివుక్కుమన్న సెలైన్ సూది పట్ల అసహ్యం, మిగిలిన కొన్ని శ్వాసలనైనా పీల్చుకోనివ్వని మాస్క్‌ని పీకి అవతల పడెయ్యలేని నిస్సహాయత, స్ట్రెచర్‌కి వేలాడుతున్న యూరిన్ బ్యాగ్ నుంచి దూరంగా జరిగి ఇన్‌స్టా స్టోరీ చెక్ చేస్కుంటున్న పదహారేళ్ళ ఆఖరి మనవడి వల్ల కలిగిన జుగుప్స .. ఇలా కథాకళి కళా కారుడి ముఖంలా నవరసాలతో నిండి పోయింది అతని మనసు.
ఒకటో రెండో రసాలు మిగిలి పోయుంటే అందులో శాంతం కచ్చితంగా ఉంటుంది. అది ప్రాణం పోయాకనేసిద్ధిస్తుంది! ప్రాణం పోతుందనగానే ముప్పై అయిదేళ్ళ క్రితం మొర్రిగాడు అడిగిన ప్రశ్నే గుర్తుకు వచ్చింది.‘‘బాబూ.. నిజంగా సొర్గం, నరకం ఉంటాయా’’ అని. ఆ ప్రశ్నకి సమాధానం కొద్ది సేపట్లో దొరక బోతుందని తెలిసినప్పుడు కొద్దిగా భయపడ్డా ఆనక స్థిమిత పడ్డాడు. మూడు రోజుల క్రితం తనకు జరిగిన ‘సహస్ర చంద్ర దర్శనం’ వేడుక మిగిల్చిన గుర్తుల్లాగా.. పండిన గోరింట టోపీలు పెట్టుకున్న ఉంగరపు వేలు, చిటికిన వేలు ‘వర్ణ’మయమై మిగతా మూడువేళ్ళను వెలివేసి కొద్దిగా దూరం జరిగినట్లున్నాయి.‘వెయ్యి పున్నమి చంద్రులను చూడగలిగినందుకు’ అని మూకుమ్మడిగా చెప్పారు పిల్లలు ‘ఈ వేడుక ఎందుకు?’ అని అడిగితే. ఎనభై మూడు పన్నెండ్లెంతని లెక్కేసుకుని తన పుట్టిన రోజు జరిగి నాలుగు నెలలైందని లెక్క సరిపెట్టుకున్నాడు.తను ప్రతి పున్నమి చంద్రుడ్నీ చూశాడా? చూస్తే... ఆయుష్షు తీరినట్టేనని శరీరం అనుకుని పడిపోబోతుందా? పడిపోతే మొర్రిగాడు అడిగినట్లు నిజంగానే స్వర్గానికో నరకానికో వెళ్తామా? ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకున్న మొర్రిగాడు స్వర్గ సౌఖ్యాలు అనుభవిస్తున్నాడా? నరక కూపంలో మగ్గుతున్నాడా? సందేహం ఏముంది? గుడిలో నాగదేవత విగ్రహం కాజేసినందుకు నరకంలోనే నానా హింసలూ పడుతూ ఉంటాడనుకున్నాడు చెల్లారావు!