ఈశ్వరమ్మ ఉల్లితోటలో తనుండే మునుములోని కలుపు చకచకా తీస్తోంది. మిగతా మునుముల్లోని కూలీలకంటే పనిలో ముందుంది. ఈశ్వరమ్మ మునుములోనే, పక్క కయ్యలో కలుపు తీస్తున్న లూర్దమ్మ మెచ్చుకోలుగా అంది -‘‘ఈశ్వరమ్మ పనిమంతురాలు. ఆ పనితనం మరెవరికీ లేదు. పట్టుదలా అంతే.’’‘‘పనికొచ్చి, ఒకర్తో మాటెలెందుకు పడాల?’’ ఈశ్వరమ్మ నవ్వుతూ లిక్కితో కలుపుతీస్తూనే అంది.‘‘అందుకేనమ్మా. మొగుడు సాధుల్లో కల్సి ఇన్నేండ్లయినా, అభిమానంతో బతుకుతున్నావు - తొమ్మిదేండ్ల ఆడపిల్లను గుండెలమీద పెట్టుకొని, మూలబడిన ముసలిదాన్ని నెత్తిన బెట్టుకొని. మా బతుక్కు పని తనమూ లేదు; పట్టుదలా లేదు. మా సిగ్గుమండా, అభిమానమూ లేదు - వట్టిపోయిన ఎనుముల మాదిరి బతకడం తప్ప. మా ఖర్మ’’. అవతలి మునుంలో చాలా వెనుకబడిన సాతాని చిన్నక్క నిజాయితీ స్వరంతో అంది.గొల్ల చిన్నక్క తన భర్తను జ్ఞాపకం చేసే సరికి, ఈశ్వరమ్మ చేతిలోని లిక్కి మరింత వేగంగా కదిలింది. కానీ ఆమె మనసు చెదిరింది. ఒక్కసారి ఆకాశంవైపు చూసి, ఎడమ చేత్తో కొంగు తీసుకొని, ముఖంమీద చెమటలు తుడుచుకొని, తలకు నుదురుతాకే వరకూ కట్టుకున్న కొంగును సరిచేసుకుంది. తన మునుములోని పక్క కయ్యలో కలుపు తీస్తున్న లూర్దమ్మ తన దాకా పక్కన చేరే వరకూ, తీసిన కలుపునే కాసేపు తీసింది. లూర్దమ్మ పక్కకొస్తూనే ఈశ్వరమ్మ గొంతు తగ్గించి, అడిగింది.‘‘లూర్దమ్మా!’’‘‘ఏం ఈశ్వరమ్మా?’’‘‘మీవాళ్లల్లో సాధుల్లో కలిసే మొగోళ్లుంటారా?’’‘‘ఉండకేమమ్మా, స్వాములోర్లుంటారు.’’‘‘కట్టుకున్న పెండ్లాల్ను వదిలేసి స్వాములోర్లవుతారా?’’‘‘ఛ ఛ, మా మతంలో ఇంత అన్యాయం లేదమ్మా. మొగోళ్లయితే పెండ్లి చేసుకోకుండానే స్వాములోర్లవుతారు. కన్నెలయితే మిస్సమ్మల వుతారనుకుంటా - అదేదో బసివిరాండ్ర మాదిరి. నాకు పెద్దగా తెల్దనుకో. మనూరికి స్వాములోరొచ్చినప్పుడు అడిగితే తెలుస్తుంది.’’‘‘పెండ్లాలున్నోళ్ళు సాములోర్లు కాలేరా?’’‘‘అయ్యేదుంది. మా వాళ్లలో వేరే తెగ ఉంది. వాళ్లల్లో పెండ్లి చేసుకొని బిడ్డల్ను కన్నా, సంసారం చేస్తున్నా ఫాదిరీలుగా ఉండొచ్చు. ఏం?’’‘‘ఏం లేదులే. ఆడోళ్లను గాలికొదిలేసి సాధుల్లో, సన్నాసుల్లో కలిసేది మాదాంట్లోనే ఉందా? మీదాంట్లో కూడా ఉందా? తెల్సుకోవాలనిపించింది.... సాయిబుల్లో ఎట్టుందో?’’‘‘ఏమో! మన ఫాతిమా నడిగితే తెలవ్వచ్చు.’’
****************************************************