వంశీ మొహంలో అర్థం కాని ఆశ్చర్యంనీడ లాగా పాకింది.‘‘ఆర్ యు షూర్?’’‘‘నూటికి నూరు శాతం..’’ అరక్షణం ఆగి ఆలోచనలో పడింది చిత్ర, తన నిర్ణయం గురించి మరోసారి ఆలోచిస్తూ. మనసులోని బాధను ఓ కంపార్ట్మెంట్లోకి తోసింది. కన్నీళ్లకు ఆనకట్ట కట్టింది. గుండె బద్దలై పోయేలా, కళ్లు ఇంకిపోయేలా ఏడవాలని మరో పక్క మనసు కోరుకుంటోంది.
తల్లి చనిపోతే ఏడవని కూతురు ఎవరైనా ఉంటారా ఈ భూమ్మీద!?వంశీలో రకరకాల ఆలోచనలు.చిత్ర పక్కనొచ్చి కూర్చున్నాడు. భుజం మీద చేయి వేసి నెమ్మదిగా వెన్ను మీదకు తెసుకెళ్ళి నిమురుతూ ఉన్నాడు. ఏమైనా చెప్తుందేమో, తనివి తీరేలా ఏడుస్తుందేమో అన్నట్లు ఆమె మొహం వంక చూస్తున్నాడు. చావుకి, ఏడుపునకి పెద్ద లంకె. అదెప్పుడు బయటకు వస్తుందో అన్నట్లు పదే పదే ఆమె మొహం వైపు చూస్తున్నాడు.ఊహూఁ .. చిత్ర కళ్లల్లో నుంచి ఒక్క చుక్క రాలేదు. ఆమె లోపలి ఆలోచనలు మొత్తం మొహం మీద పర్చుకొని ఆ మొహం కొంచెం విషాదంగా, కొంత కోపంగా, మరికొంత అపనమ్మకంగా అతనెలా అనుకుంటే అలా కనిపిస్తోంది.చిత్ర ఏడిస్తే ఓదార్చాలనుకున్నాడు.చిత్ర డీలా పడిపోతే ధైర్యం చెప్పాలనుకున్నాడు.చిత్ర నిస్సత్తువుగా అయిపోతే లేచి కూర్చో బెట్టి నమ్మకాన్ని అందివ్వాలని అనుకున్నాడు.ఏడిస్తే అవసరమని టిష్యూ బాక్స్ తీసుకొచ్చి పక్కన పెట్టాడు.
దాని అవసరమే రాలేదు.బలవంతానైనా చిత్ర చేత కాఫీ అయినా తాగించాలనుకొని కాఫీ చేసి తెచ్చిచ్చాడు. మారు మాట్లాడకుండా చిత్ర కాఫీ తీసుకొని తాగటం మొదలు పెట్టింది.చిత్ర ప్రవర్తన అతడిని కొంత నిరాశ పర్చింది. తాననుకున్నవేమీ చేయలేక పోయాడు. మంచి భర్తలాగా ప్రవర్తించే అవకాశం అతనికి రాలేదు.‘‘కొత్త వేరియంట్ గురించి భయపడుతున్నావా? అందుకనే ఇండియా వెళ్ళటం లేదా?’’ కారణం కనుక్కున్నానన్నట్లు మొహం పెట్టాడు వంశీ.అడ్డంగా తల ఊపింది. అతనిలో స్పష్టంగా నిరాశతో వచ్చిన చిరుకోపం.‘‘కాసేపు పడుకుంటా’’ బెడ్రూమ్లోకి వెళ్తున్న చిత్రను చూస్తూ ‘హమ్మయ్య’ అనుకున్నాడువంశీ.‘ఇప్పటికి మామూలు మనిషిలా ప్రవరిస్తోంది. తల్లి చనిపోయిందన్న వార్త విన్న కూతురు ఎలా ఉండాలో అలా ఉంటుంది కాబోలు. బహుశా మంచం మీద పడుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. అమ్మ లేదన్న నిజం అర్థమై, చివరి చూపు కోసం ఇండియా బయలుదేర్తుంది’ వెళ్ళనని చెప్పినా సరే, లాప్టాప్లో ఇండియా టికెట్స్ చూడటం మొదలుపెట్టాడు.