‘‘మళ్లీ స్నానం చేస్తున్నారుటండీ. మీ పిచ్చి ముదిరిపోతోంది సుమండీ. ఊరందరికీ మందులివ్వడం కాదు. మీ ఉబ్బసం సంగతి ముందర చూసుకోండి’’ విపరీతమైన దగ్గుతో పెరటిచప్టా మీద విలవిల్లాడిపోతున్న భర్తను గమనిస్తూ విరుచుకుపడింది సులోచనమ్మ.‘‘కొత్త మాట చెప్పవమ్మా. పాత పాటే పాడకు. అన్నీ తెలిసీ రంకెలెందుకో!’’ దగ్గు తెరలను తప్పించుకునే ప్రయత్నం చేస్తూనే అన్నారు రాఘవాచార్యులు.

పెనిమిటి తాజుగా ఇస్తున్న ఆ సమాధానం సులోచన మదిలో మరిన్ని మంటలు రేపింది. చేస్తున్న బియ్యం జల్లింపును వదిలిపెట్టేసి గభాల్న వంటింట్లోంచి పెరట్లోకి వచ్చేసింది.‘‘నడి ఎండకే మీ తలగడుగులు పదిహేనయ్యాయి. ఈ లెక్కన సంజెవేళకి పాతికవుతాయి. ఇంతలా అనుదినమూ జలకాలాడితే బతకడానికా? చావడానికా? అసలే ఎగశ్వాస. తూర్పున మేఘం పడితే అంతే. మీ ఊపిరితిత్తులు ఉసూరుమంటాయి. అలుపూ అలమటాను’’ మొగుడిమొహంలో మొహంపెట్టి అదోరకంగా చేతులు తిప్పుతూ రేగడిరది. అంతటితో ఆగలేదు. భర్త చేతుల్లోని ఇత్తడి చెంబును చొరావరీగా లాగేసుకుంది. అప్పటివరకూ బియ్యాన్ని జల్లెడ పట్టినందువల్ల ఆమె చేతులకి అంటుకున్న తౌడుపొరలు రేణువులుగా మారి చిత్రంగా గాల్లో ఎటెటో ఎగిరాయి.‘‘అయ్యో అయ్యో. ఇదేం హఠం. కడపోతతో శ్రీరామరక్ష పెట్టుకోనీవే’’ నీళ్లగాబుకుకాసింతగా అనుకుంటూ చెయ్యి చాచారు రాఘవులు.‘‘హమేషా మీరిలా అభిషేకాలకు దిగిపోతుంటే రాముడు కాదు. వాడి అబ్బయినా రక్షించలేడు’’ ఆగ్రహం పట్టు తప్పగా పెరట్లో అయిమూలగా పెరుగుతున్న బీరపాదుమీదికి చెంబు విసిరేసింది సులోచనమ్మ.‘అంతా పెళుసే. సుందరం వందనం కానరాదు కదా..’ ఆమెను ఉద్దేశించి ఎప్పటి లాగానే ఎదలో మరోసారి మూలుక్కున్నారు పతిదేవులవారు.

*************

చోడవరం తాలూకా గ్రామసీమల్లో గొడవర్తి రాఘవాచార్యుల పేరు తెలియని వారుండరు. అప్పటి పల్లెటూళ్లలో ఇంగ్లిషు వైద్యం ఎక్కడిది?! పరింకంపలాంటి వ్యాధి ఏదయినా వదిలిపెట్టక పీడిస్తుంటే తప్పదన్నట్టుగా వైజాగ్‌ కింగ్‌జార్జి ఆసుపత్రికి పోయేవారు. అంత వరకూ స్థానిక వైద్యులతోనే సయ్యాటలన్నీను. ఆ రకంగా అర్జనగిరి పల్లెటూరు కేంద్రంగా చుట్టుపక్కలంతా రాఘవుల వైద్యమే వాసికెక్కింది.ఆచార్యులది సేవాదృక్పథం. అనువంశికంగా వస్తున్న ఆయుర్వేదాన్ని నమ్ముకున్నారు. అమ్ముకోలేదు. జబ్బుమనిషికి స్వస్థత చేకూరితే కొండంత ధనం అన్నట్టు సంతోషపడీవారు. ఆయన భార్య సులోచనమ్మా అదే మోస్తరు. సంతానలేమితో చింతపడుతున్న తమకు వచ్చే జన్మలోనయినా పిల్లాపిచికా కలగాలంటే నలుగురికీ సాయం చేయాలనేది ఆయమ్మ నమ్మకం. కాబట్టే, వైద్యంచేసే భర్తకు కల్వం నూరి పెడుతుంది. మందులు కట్టిపెడుతుంది. పసరు తీసిపెడుతుంది. కచ్చూరాలూ ఉసిరీ పప్పూ నూరిపెడుతుంది. ఒక సిద్ధమకరఽ ద్వజమైనా, మరో స్వర్ణక్రవ్యాధి అయినా, ఇంకో శంఖవటి అయినా - పేరు చెప్పగానే ఏ గూట్లోంచో తీసి చప్పున భర్తకు అందిస్తుంది. అందుకే కామోసు. వైద్యం కోసం వచ్చేవాళ్లలో కొందరు అంటూ ఉంటారు.