బాల్కనీలో మొక్కలకి నీళ్లు పోస్తూ ఎండిన ఆకులూ కొమ్మలూ తుంచి తీసేస్తున్నా. ఎంతో ఇష్టపడి కడియం నుంచి తెచ్చుకున్న బొండుమల్లి మొక్క ఎందుకో క్రమక్రమంగా ఎండిపోతూ వచ్చింది. ఇక పూర్తిగా ఎండి పోయిందని పీకేయబోతుంటే, కాండం వెనగ్గా లేలేత చిగురొకటి మధ్యాహ్నపు ఎండకి మెరుస్తూ కనపడింది.
ఒక్కసారిగా సంతోషం కలిగింది. జీవితం అంతేనేమో! ఆశగా ఎదురు చూసిన చోట ఆశించిన ఫలితం రాదు. ఊహించనిచోట అనుకోని ఆనందం చిరుజల్లై కురుస్తుంది.మొక్క చుట్టూ తవ్వి, ఎండిపోయిన భాగాలు కత్తిరించి తీసేశాను. ఫోన్ మోగుతుండగా గబగబా హాల్లోకి వచ్చి రిసీవర్ ఎత్తాను.‘‘అమ్మా, నా పేరు సుమాళి. డాక్టర్ గార్నడిగి మీ నంబరు తీసుకున్ననమ్మా’’ ఫోన్‌కి అవతల వైపు నుంచి వినసొంపైన కంఠం మెత్తగా వినిపించింది.సుమాళి .. పేరెంత బావుందో! ‘‘అవును, నువు ఫోన్ చేస్తావని డాక్టర్‌గారు చెప్పారు.’’‘‘సారు దేవుడమ్మా. మా చర్మం తీసి చెప్పులు కుట్టిచ్చినా రుణం తీరదు..’’‘‘అయ్యో.. అవేం మాటలు? నిన్న చెకప్‌కి వచ్చార్ట కదా?’’‘‘అవునమ్మా, ఇప్పుడు మంచిగయ్యిండమ్మా మా ఆయన.’’‘‘చాలా సంతోషం. సుఖంగా ఉండండి’’ అన్నాను పిల్లలొచ్చేలోపు చేయాల్సిన పనులు తలచుకుంటూ.‘‘ప్రభావతమ్మ చెప్పినందుకు సారు మంచిగ చూసిండు.
ఏమిచ్చి రుణం తీర్చుకుంటం? మీరేమో బ్యూటీపార్లర్‌కి వెళ్లరని సారు చెప్పిండు. ఒక్కసారి తలకు ఆయిల్ మసాజ్ చేపిచ్చుకోండి. లేదా హెన్నా పెట్టిచ్చుకోండి. పాదాలకి పెడిక్యూర్ - ఏదో ఒకటి మీకిష్టమైనది చేపిచ్చుకోండి. నచ్చితే అపుడపుడు వచ్చి చేసిపోతా.’’సుందర్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. క్షణం అలోచించాను. ఇపుడిపుడే జుట్టులో నెరిసిన వెంట్రుకలు కనబడుతున్నాయి. హిస్ట్రెక్టమీ తర్వాత పాదాల మంటలు కొంచెం బాధపెడుతున్నాయి. సుమాళి మాటల్లోని అభ్యర్థన మనసుకి తాకడంతో, శనివారం రమ్మని చెప్పి ఫోన్ పెట్టేశాను.అయిదేళ్లక్రితం ప్రభావతి గారు ఫోన్ చేసి తనకి బ్యూటీషియన్‌గా పనిచేసే అమ్మాయి భర్తకి గొంతు మీద వాపు వచ్చిందని చెప్పి, ‘డాక్టర్ గారు చూస్తారా’ అనడిగారు. సుందర్ హెడ్ అండ్ నెక్ ఆంకాలజిస్ట్ కావడంతో, అతనికి కావలసిన పరీక్షలు చేసి ‘సలైవరీ గ్లాండ్ ట్యూమర్’ అని చెప్పాడు. ఆవిడ మళ్లీ ఫోన్ చేసి, ‘వెంకటేశ్‌కి ఒక కాలు లేదనీ, ఇల్లు ప్రధానంగా అతని భార్య కష్టం మీదనే నడుస్తోందనీ, ఇద్దరు చిన్న పిల్లలున్నారనీ, ఫీజు తగ్గించి తీసుకోమని చెప్ప’మనీ అభ్యర్థించారు.