పనీపాటు చేసుకుని బతికే కష్టజీవి అతడు. తెలివి శూన్యం. ఎంత కష్టపడినా జనం అతడిని హేళనచేసేవారు. తనొక గొప్పవాడుగా బతకాలనీ, అందరి గౌరవం పొందాలని కోరుకునేవాడు. కానీ ఊరివాళ్ళ హేళనలు భరించలేక ఎంతో ఆవేదన చెందేవాడు. కానీ ఆకస్మాత్తుగా గొప్పవాడైపోయాడతను. జనం అతడిని దేవుడిలా పూజించడం మొదలెట్టారు. అప్పటికీ అతడికి సంతృప్తి కలగలేదు. అంతకంటే గొప్పగౌరవం ఎక్కడినుంచి వస్తుంది? అతడికి అంతకుమించి ఇంకేం కావాలి?…
పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్లి, చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘‘రాజా, సద్బుద్ధికి, శక్తిసామర్థ్యాలకి, చిత్తశుద్ధికి సాటి రాజులంతా నిన్ను ఆదర్శంగా తీసుకుని ఆరాధిస్తున్నారు. నువ్వు ఏ దేశం వెళ్లినా అక్కడిప్రజలు నీకు బ్రహ్మరథం పడతారు.
అలాంటి నువ్వు ఓ సిద్ధుడికోసమని ఈ అపరాత్రివేళ ఈ శ్మశానంలో తిరగడం తెలివైనపని అనిపిస్తున్నదా? నిన్ను చూస్తుంటే నాకు రంగడికథ గుర్తుకొస్తోంది. పుట్టిన ఊళ్లో అంతా చిన్నబుచ్చుతున్నారని వ్యథ చెందేవాడు. తీరా అక్కడివాళ్లు తనని దేవుడిలా గౌరవించడం మొదలుపెడితే, ఆ ఊరు వదిలి, తనని సామాన్యుడిలా చూసే చోటుకువెళ్లి స్థిరపడ్డాడు. నీకు ఆ కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను’’ అంటూ ఇలా చెప్పసాగాడు.లక్ష్మణపురంలో రంగడనేవాడు ఆ ఇంటా ఈ ఇంటా పని చేసుకుని బ్రతికేవాడు. వాడి బుర్రలో తెలివి శూన్యం. అందుకని వాడిచేత పనులు చేయించుకునేవారు కూడా వాణ్ణి గౌరవించేవారు కాదు. పని బాగా చేయకపోతే ఒకటికి పది మాటలని తిట్టేవారు. పని బాగా చేస్తే కూడా మెచ్చుకునేవారు కాదు. ‘‘ఈరోజు నీకేమైందిరో, ఇంత బాగా చేశావు’’ అని వేళాకోళం చేసేవారు.ఊళ్లో రంగడు కనబడితే చాలు పెద్దవాళ్లు ఏదో మాట అని నవ్వేవారు. ఆడవాళ్లు వాడిని చూడగానే తమలో తాము నవ్వుకునేవాళ్లు. చిన్నపిల్లలైతే ఏదో కోతిని చూసినట్లు ముక్కులుగోక్కుని వెక్కిరించి ఏడిపించి వినోదించేవారు.ఎవరిజోలికీ వెళ్లకపోయినా, అంతా తనని పనిగట్టుకునిమరీ ఎగతాళి చేస్తుండడం రంగడికి చాలా బాధగా ఉండేది. అందుకుకారణం తనని వాళ్లు తెలివితక్కువవాడని అనుకోవడమేనని వాడు గ్రహించాడు. ఊళ్లో అందరితోపాటు సమంగా గౌరవంపొందుతూ, వాళ్లలో ఒకడుగా కలిసి బ్రతకాలని ఉంది వాడికి. ఆ కోరిక తీరాలంటే తను తెలివైనవాణ్ణని అంతా గుర్తించాలి. అందుకని వాడు ఊరివాళ్లముందు తన తెలివి ప్రదర్శించేందుకు కొన్ని ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాలు ఊళ్లో వాణ్ణి మరింత నవ్వులపాలు చేశాయి.