‘‘నాన్నా, ఇబాకో’’ పొద్దుటి నుంచి పిల్ల ఐస్ర్కీం కోసం ఒకటే గోల.‘‘ఆర్డర్స్ తీసుకుని ఇచ్చి రావడమే నాపని. అవ్వన్నీ ఇంటికి తేవడం కుదరదు’’ అంటాడు నెల్లాళ్ళ కిందట జొమాటోలో చేరిన మా ఆయన.‘‘కరోనా కదా. బైటివి తినకూడదు. సాయంత్రం నేను చేసి ఇస్తాగా’’ బుజ్జగించాలి అని చూస్తాను నేను. పది రూపాయల రియో బిస్కెట్ ప్యాకెట్, చించకుండా పప్పు గుత్తితో చెత్తమత్తంగా చితగ్గొట్టి, తరవాత కవరు కొద్దిగా కట్ చేసి లోపల పాలుపోసి, ఓ చిన్న ఐస్ర్కీం స్టిక్ పెట్టి ఫ్రిడ్జ్‌లో పెడితే ఐస్ ఫ్రూట్ లాంటి బ్రహ్మ పదార్థం ఏదో వస్తుంది.
కరోనా వచ్చాక (ఎదురింటి ఆంటీగారు చనిపోయాక!) ఇబాకో ఐస్ క్రీం దగ్గర్నుంచీ సింగినాదం వంటకాలదాకా అన్నీ ఇంట్లోనే.ఐస్ క్రీం తినక ఎన్ని రోజులో అయింది అని, నిన్న ఆంటీగారి అబ్బాయి వాసు ఫోన్ చేస్తే, మా సిరి పిల్లదానికి గుర్తు వచ్చింది. ఆంటీగారు వున్నపుడు మాటి మాటికీ ఇలాంటివి తెప్పించి బుజ్జిదానికి ఇచ్చేది.‘‘వాసు, పిల్లలు కూడా ఇప్పుడు ఇక్కడవుంటే బాగుండేది’’ అని అమెరికాలో వున్న కొడుకు, మనవరాళ్ళని తలుచుకుని నిట్టూర్చేది.‘‘డబ్బులు ఖర్చు అయినా ఫర్వాలేదు. అమ్మ వున్నప్పుడు ఇల్లు ఎంత బాగా వుండేదో ఇప్పుడు కూడా అలావుండాలి’’ అని చెప్పాడు.అమెరికాలో వుండేవాళ్ళకి డబ్బుకొదవ ఏముంది! అక్కడ కూడా పైసాపైసా లెక్కేసే పీనాసోళ్ళు బోలెడుమంది వుండి తీరాల్సిందే అనుకోండి; కానీ వాసు, అంటీగారు అలాకాదు. డబ్బులకోసమే ఆశించే మనిషి అయితే తల్లి పోగానే ఇల్లు అద్దెకి ఇవ్వడం గురించి ఆలోచించేవాడు. ఎంత లేదన్నా పాతికవేలు అద్దె వస్తుంది.‘‘జీతం ఎంత ఇస్తారని చెప్పను?’’ ఇవాళ రేపు పనిమనుషుల రేట్లు ఎలావున్నాయో నాకూ తెలీదు. ఊడ్చి తడిగుడ్డ వెయ్యడానికి రెండుమూడు వేలు అడుగుతారేమో.‘‘పదివేలదాకా ఇద్దాం అక్కా’’ నోరారా అక్కా అని పిలుస్తాడు నన్ను. మొదట్నించీ అదే అలవాటు.పదివేలు! కరోనా ముందు నేను పదేళ్ళు ప్రైవేటు స్కూల్లో టీచర్ వుద్యోగం చేశాను. చివరి ఏడాది నా జీతం పదివేలే! గవర్నమెంట్ హాస్టల్స్‌లో వుండి చదువుకున్నాను. బిఇడి చేసేప్పుడు ఖర్చుల కోసం ట్యూషన్ చెప్పాను. తరవాత ప్రైవేటు స్కూల్లో చేరాను. ప్రైవేటు స్కూల్ పనిలో మునిగితే, గవర్నమెంట్ వుద్యోగం దక్కించుకుని తేలడం కష్టం. మనిషిని పిండి పిప్పి చేస్తారు. చదువుకునే టైం వుండదు. వస్తుందో రాదో తెలీని వుద్యోగం కోసం చేతిలో వున్న పనిమాని ప్రిపరేషన్ కోసం పోలేము.