పానకాలింట్లో పొద్దున్నే మళ్లీ మంటల్లేచాయి. మాటల్తో ఆ మంటలు రాజేసిన గంగమ్మ ఇంకా నిప్పులు కక్కుతూనే ఉంది. నిప్పుల వంక చూసే ధైర్యంలేని పానకాలు దిగాలుగా కూచొని ఉన్నాడు. ఆ సెగల ధాటికి పానకాలు భార్య మొహం మాడిపోయిన మొక్కజొన్న పొత్తులా అయింది.పడమటి గదికే పరిమితమైపోయి, మాటలవేడిని బట్టి పరిస్థితి తీవ్రతను అంచనా వేస్తోంది పానకాలు కూతురు సుస్మిత.
మెల్లగా బీటలువారిన ఆమె మనసు ఇప్పుడు ముక్కలై విరిగిపడుతోంది. వసారాలోకి వచ్చి అత్తను దులిపెయ్యాలన్న ఆవేశం ఆమెను నిలవనియ్యటం లేదు. అలా చేస్తే తండ్రి ఒప్పుకోడని నిగ్రహం పాటిస్తోంది.‘‘ఇదుగో ఇదే సివరి రాక, సివరి మాట. మళ్లా నీ గడప తొక్కను; అల్లుడికిస్తానన్న ఆస్తి ఇవ్వందే గడప దాటను’’ అని అరుగుమీద కూచుంటూ ‘‘వచ్చి గంట దాటింది. మొహాన కాసిన్ని కాపీ నీళ్లు పోసే దిక్కుగూడా లేదు’’ అంది నిష్ఠ్ఠూరంగా. పానకాలు భార్య వంటింటి వైపు పరుగు తీసింది.పానకాలు పశువుల కొట్టంలోకి నడిచాడు. తాతల కాలం నుంచి ఇంటెనక ఆరు సెంట్ల స్థలంలో ఉన్న కొట్టం అది. ధరలు ఆకాశంలో ఊరేగినప్పుడు ‘కొట్టం అమ్ముతావా’ అని అడగని బేరగాడు లేడు. రెండు గేదెల ముందు మేతవేసి, పాలు పితికి ఇంట్లోకి నడిచాడు. భార్య ఎదురొచ్చి, పాలతపేళా అందుకుంటూ ‘‘పిండి లేదండి. హోటలుకెళ్లి ఇడ్లీ తేకూడదూ’’ అంది.పానకాలు బయటికి నడిచాడు. రెండిళ్లకవతల వ్యాను ఆగి ఉంది. దాన్నిండా ఇంటిసామగ్రీ. ఇంకో పోర్షన్ వాళ్లు కూడా ఖాళీ చేసినట్లున్నారు. వాహనం వెళ్లిపోయింది. సాంబయ్య వీధి అరుగు మీద దిగాలుగా కూచొని ఉన్నాడు.పాతిక అడుగుల వెడల్పు కూడా లేని ఆ వీథిలో అయిదంతస్తుల భవనం కట్టాడు సాంబయ్య. చేతిలో డబ్బుండి చేసిన పని కాదు. అద్దెలకు జనం ఎగబడుతున్న రోజుల్లో బ్యాంకులు పిలిచి మరీ అప్పులిచ్చాయి. నెలనెలా వచ్చే అద్దెడబ్బుతో తేలిగ్గా వాయిదాలు కట్టెయ్యొచ్చని, భవనం మిగిలిపోతుందని లెక్కలేసుకున్నాడు. లెక్క తప్పలేదు. పది పోర్షన్లూ కిటకిటలాడాయి. సాంబయ్య ఆకాశంలో నడిచాడు. హఠాత్తుగా పరిస్థితి తలకిందులైంది.