గాంధీ బొమ్మకాడ మీటింగ్‌కి వెళ్ళొచ్చిన బూసియ్య చాలా సంతోషంగా వున్నాడు. అన్నీ అనుకూలిచ్చి, అక్కడ చెప్పినట్టు జరిగితే, ఇయ్యేటితో తన కష్టాలు గట్టెక్కొచ్చు అనే నమ్మకం కలిగింది.అయినా మనసులో భయం. ధైర్యం చాలడంలేదు.బూసియ్య బక్క రైతు. మూడెకరాలు సొంత పొలం వుంది.
దానికి తోడు మరో నాలుగెకరాల పొలం మగతాకి తీసుకుని సాగు చేస్తున్నాడు.ఎగసాయం మూడేళ్ళ నించీ ముదనష్టంగానే వుంది తప్ప మూడ్రూపాయలు మిగిలింది లేదు. ముందుకి పోయింది లేదు. మూడడుగుల ముందుకి పోతే నాలుగడుగులు ఎనక్కొచ్చినట్టుగా వుంది. బూసియ్య మంచి కష్టజీవి. పెళ్లాం చెంచమ్మ కూడా పెనిమిటికి తోడే! ఇద్దరూ ఇద్దరే! పనిలో దిగితే ఝమాయించి చేసేవాళ్లు.మూడేళ్లనాడు నాలుగు ఎకరాలు మగతాకి పట్టి మిరప వేశారు. బాగా కష్టించారు. బెమ్మాండంగా పండించారు. ఎకరాకి ముప్పయ్ కింటాళ్ళ దిగుబడి తీశారు. బాగా డబ్బు మిగులుతుందనుకున్నారు. రైతు ఇంటికి పంట చేరింది. పిడుగు పడింది. అంతకు ముందేడు పన్నెండేలు అమ్మిన మిరపకాయలు ఆరేలకి అడుగుతున్నారు.
‘‘ఇదేందయ్యో! నిరుడు పన్నెండేలు అమ్మిన కాయలు ఇయ్యేడు ఆరేలా? నిరుటిలో సగం ధరా? నిరుటి కంటే కర్చులు ఇబ్బిడిముబ్బిడిగా పెరిగినియ్యి కానీ తగ్గినయ్యా? ఆ వార ధర పెరగాలిగా? పెరక్కపోతే మానె, తగ్గటం ఎందీ?’’ అంది చెంచమ్మ బాధగా.‘‘మనం ఏం చేస్తాం? వ్యాపారుల ఇష్టారాజ్జెం! ఇత్తనాలూ, పురుగు మందులూ, ఎరువు మందులూ, తెగులు మందులూ వాళ్లు చెప్పిన ధరకి కొంటాం! అట్నే మన పంటకూడా వాళ్లు చెప్పిన ధరకి ఇస్తాం! అమ్మే దగ్గరా వాళ్ళదే పెత్తనం, కొనే దగ్గరా వాళ్ళదే పెత్తనం! మన చేతిలో ఏం వుంది బూడిద!’’ అన్నాడు బూసియ్య.నాలుగెకరాల మీదా 120 కింటాళ్ళ పైనే దిగుబడి వచ్చింది. అంతకు ముందేడు ధర వున్నా, 14 లక్షలు వస్తయనుకున్నారు. ఎడెనిమిది లక్షలు ఖర్చులు పోయినా ఆరేడు లక్షలు మిగలొచ్చు అనుకున్నారు. కానీ సగం ధర! అమ్మితే ఏడు లక్షలే వచ్చాయి. పెట్టిన పెట్టుబడికి వచ్చిన రాబడికి సరిపోయింది. ఇరగామురగా చాకిరి చేసినా రూపాయి మిగల్లేదు. ధరలోనే మునిగిపోయారు.